- వరుస బాంబు పేలుళ్లతో హడలిన జనం
- దిల్ షుక్ నగర్ పరిసరాల్లోనే రెండు చోట్ల పేలుళ్లు
- టిఫిన్ బాక్స్ లో పెట్టి టైమర్ తో పేల్చి..
- 18 మంది దుర్మరణం.. 131 మందికి గాయాలు
- ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు
- ఇండియన్ ముజాహిదీన్ కో ఫౌండర్ భత్కల్
- ఐదుగురే కీలక దోషులని తేల్చిన కోర్ట్
- ఎన్ ఐ ఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు
- ఐదుగురికి ఉరే సరి అని తేల్చిన న్యాయస్థానం
హైదరాబాద్ లోని దిల్షుక్ నగర్… చాలా రద్దీగా ఉండే ప్రదేశం… అది 2013 ఫిబ్రవరి 21వ తేదీ. జనం అంతా ఎవరి గొడవలో వారున్నారు. రాత్రి ఏడుగంటల వ్యవధిలో మొదటి పేలుడు సంభవించింది. అది మలక్ పేట్ పీఎస్ పరిధిలోని దిల్ షుక్ నగర్ వెంకటాద్రి థియేటర్ ముందున్న 107 బస్సులు ఆగే ప్రదేశం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కొన్ని నిమిషాల వ్యవధిలో కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ వన్ మిర్చ్ సెంటర్ వద్ద మరో బాంబు పేలింది. ఈ రెండు పేలుళ్లు కేవలం 150 మీటర్ల దూరంలోనే జరిగాయి.
ఇండియన్ ముజాహిదీన్ పనే..
జనంలో పానిక్, గందరగోళం సృష్టించేందుకు ఇలా వెంట వెంటనే దగ్గర ప్రాంతాల్లో పేలుళ్లు జరపడం ఇండియన్ ముజాహిదీన్ సంస్థ మాత్రమే అమలు చేసే టెక్నిక్. ఈ మారణహోమంలో మొత్తం 18 మంది చనిపోగా 131 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి అనేక వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయి. కొన్ని షాపులు ధ్వంసమయ్యాయి. జనం తీవ్రంగా భయపడిపోయారు. కొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులు, ఛిద్రమై పోయిన మృతుల శరీరాలు, ఎగిరి పడిన మాంస ఖండాలు.. రక్తపు మడుగులు… ఇలా ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని తలపించింది.
కుక్కర్, టిఫిన్ బాక్స్ బాంబులు..
ప్రెషర్ కుక్కర్ బాంబులు, టిఫిన్ బాక్స్ బాంబులతో మారణహోమం సృష్టించడం ఉగ్రవాదుల కొత్త పంథాగా మారింది. టిఫిన్ బాక్స్ లో పెట్టిన బాంబును టైమర్ తో పేల్చడం వల్ల ఈ దురదృష్టకర ఘటన జరిగిందని దర్యాప్తు బృందాలు తేల్చాయి. ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు కారణమైందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నరహంతకులైన ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమం హైదరాబాద్ నగర వాసుల పాలిట ఒక పీడకల.
దేశంలో ఎక్కడ ఏం జరిగినా?
దేశంలో ఎక్కడ ఏ ఉగ్ర దాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే తేలుతున్నాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. హైదరాబాద్ లో ఉగ్ర సంస్థలు స్లీపర్ సెల్స్ రూపంలో పనిచేస్తున్నాయని ఎన్ ఐ ఏ కూడా ధృవీకరించింది. హైదరాబాద్ లో ఉగ్రమూలాలు ఉన్నాయని మరోసారి స్పష్టమైన సందర్భం ఇది. అంతకు ముందు గోకుల్ ఛాట్ లో కూడా ఇలాగే బాంబు పేలి కొందరు మరణించారు. ఆ తర్వాత లుంబినీ పార్క్ బుద్ధవనంలో కూడా ఇలాంటి బాంబు పేలుడు ఘటనే జరిగింది. ఇవన్నీ ఉగ్రవాదులకు హైదరాబాద్ సాఫ్ట్ టార్గెట్ గా మారిందనడానికి స్పష్టమైన ఉదాహరణలు.
ఉగ్రవాదిగా మారిన ఇంజనీర్ భత్కల్..
ఉగ్రవాదం నయా రూపం మార్చుకున్నాక తెలివైన వారు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు ఉగ్రవాదులుగా మారడం మొదలు పెట్టారు. దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో కూడా కీలక వ్యూహకర్త యాసిన్ భత్కల్ కర్ణాటకలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఈ కేసును టేకప్ చేసిన ఎన్ ఐ ఏ సంస్థ సుదీర్ఘంగా, కూలంకషంగా దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్ ఐ ఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఐదుగురు ఉగ్రవాదులకు 2016 డిసెంబర్ 13న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసుదల్లా అక్తర్, జియావుర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్,అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండే అలియాస్ సాగర్, అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. ఎన్ ఐ ఏ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హై కోర్టు నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష సరైనదేనని తేల్చి చెప్పింది.
నిందితులకు చివరి ఆశ
ఇప్పుడు నిందితుల ముందు రెండే రెండు అవకాశాలు ఉన్నాయి. అవి ఒకటి సుప్రీం కోర్టు తలుపు తట్టడం. అక్కడ కూడా ఊరట లభించకపోతే రాష్ట్రపతి క్షమాభిక్షను కోరడం. కానీ ఇంత మంది అమాయకుల మరణాలకు కారణమైన వారికి రాష్ట్రపతి క్షమాభిక్షదొరకడం దాదాపు అసాధ్యం.అరుదైన ఘటనలలోనే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం అనేది సాధ్యం.