విదేశీ వాణిజ్యంలో మార్పులు, ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల జీవితాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో, వనామీ రొయ్యల ఎగుమతులపై సుంకం 3శాతం నుంచి 26శాతానికి పెరిగింది. దీని ఫలితంగా, ఏపీ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఒక లక్ష రూపాయల విలువైన రొయ్యల ఉత్పత్తి కోసం ప్రస్తుతం లక్షా 26 వేల రూపాయలు ఖర్చవుతోంది. రవాణా, ప్యాకింగ్ ఖర్చులు కూడా పెరిగిపోయి, మొత్తంగా రైతుల పరిస్థితి తలకిందులవుతోంది. ఎగుమతి దారులు ధరలను కేజీకి రూ.30 నుండి రూ.50 వరకు తగ్గించడంతో, రైతుల ఆదాయం తీవ్రంగా తగ్గిపోయింది. 100 కౌంట్ రొయ్య ధర ఒకప్పుడు రూ.250 ఉండగా, ఇప్పుడు అది రూ.210కి పడిపోయింది.
ఈ నెల 9వ తేదీ నుంచి అమెరికా విధించే సుంకాలు అమల్లోకి రానుండగా, ఏటా 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు ఏపీ నుంచి అమెరికాకు వెళ్తాయి. కేవలం పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 2 వేల టన్నులు ఎగుమతి అవుతున్నాయి. రైతుల ఆందోళనల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసి, రొయ్యలపై సుంకాల్లో మినహాయింపు కోరారు. మత్స్యరంగం రాష్ట్ర జీడీపీలో 11శాతం వాటా కలిగి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రైతుల సంక్షేమానికి కేంద్రం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం కూటమి ప్రభుత్వం మౌనంగా ఉందని ఆరోపిస్తున్నారు. వ్యాపార వర్గాలు ధరలను కుదిస్తూ రైతులను దోపిడీ చేయడాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని వారు అంటున్నారు.
రైతుల కన్నీళ్లపై రాజకీయాలు ఆపండి – వైఎస్ జగన్
ఆక్వారంగం కష్టాల్లో కూరుకుపోయినా, సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. రొయ్యల ధర ఒక్కసారిగా రూ.280 నుంచి రూ.200 – రూ.210కి పడిపోవడం వెనుక అమెరికా టారిఫ్‌లతో పాటు, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపించారు. ఎగుమతులపై టారిఫ్‌లు ఒకవైపు అయితే, రాష్ట్రంలో వ్యాపారులు సిండికేట్ అయి రైతులను నిలువునా దోచేస్తున్నారని, ఫలితంగా రైతులకు నష్టమే మిగులుతుందన్నారు.
ప్రభుత్వం చొరవ చూపకపోతే, ఆక్వా రంగం మరింత నష్టపోతుందని, ధరల పతనాన్ని నిరోధించేందుకు ప్రభుత్వ స్థాయిలో సమీక్ష జరిపి, తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గత వైఎస్‌ఆర్ ప్రభుత్వం హయాంలో రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ఆయన గుర్తు చేశారు.
తమ పాలనలో ఆక్వారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ, ధర నియంత్రణ చట్టాలు, 100 కౌంట్‌కు కనీస ధర ₹210 నిర్ణయం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే, ఫీడ్ ధరలను మూడుసార్లు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు.
కరెంట్ రాయితీ విషయంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిందని జగన్ గుర్తు చేశారు. 54 వేల అక్వా కనెక్షన్లకు ₹1.50కే యూనిట్ ధరతో విద్యుత్ అందించామని తెలిపారు. ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆర్బీకేల్లో నియమించి రైతులకు సకాలంలో సహాయం అందించామన్నారు.
ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించాలని జగన్ డిమాండ్ చేశారు. తక్షణమే ధరలను నిర్ణయించి రైతులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక లేఖ రాయడమే పరిష్కారం కాదని, ధరల కుయుక్తులకు పాల్పడే వారికి గట్టిగా చెక్ వేసే సమయం ఇది అని గుర్తు చేశారు. అమెరికా టారిఫ్‌లు కేవలం మనకే కాదు, ఇది కొనసాగే ప్రక్రియ అని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఆచరణాత్మకంగా ముందడుగు వేయాలని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.