టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అటు చూస్తే ఏడాదంతా నెంబర్ వన్ స్థానంలో ఉండి, చివర్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ రేసు నుంచి బయటకు వచ్చేసేలా కనిపిస్తోంది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను 3-0తో కోల్పోవడం కోలుకోలేని దెబ్బ కొట్టింది. అవి గెలిచి ఉంటే, ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడినా ఇబ్బందులు ఉండేవి కావు.
ఏదైనా ఎప్పుడైనా ప్రశాంతంగా ఫైనల్ కి వెళ్లడం టీమ్ ఇండియాకి కలిసిరాలేదని నెటిజన్లు అంటున్నారు. అలా 2023 వన్డే వరల్డ్ కప్ లో ఓటమన్నది లేకుండా వెళ్లి, ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడూ పీకలమీదకు తెచ్చుకోవడం, ఆ టెన్షనులో ఆడటమే భారత్ కి కలిసొచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఒకసారి టీమ్ ఇండియాలో ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
ప్రస్తుతం కేఎల్ రాహుల్, యశస్వి, నితీశ్ మాత్రమే కొద్దిగా ఫామ్ లో ఉండి ఆడుతున్నారు. వీళ్లలో నితీశ్ తప్ప మిగిలిన వాళ్లు ఒకటి ఆడితే, రెండు సున్నాలు చుట్టేస్తున్నారు. కొహ్లీ ఫస్ట్ టెస్టులో సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా మూడో టెస్టులో 77 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ నాలుగో టెస్టులో 50 పరుగులు చేశాడు. తర్వాత అంతే సంగతి. ఇలా ఐదు టెస్టుల సిరీసుల్లో మనవాళ్లు 8 ఇన్నింగ్స్ ఆడి, ఒక ఇన్నింగ్ లో అలా మెరిపించారు. కొందరు అది కూడా లేదు.
ఆస్ట్రేలియా సిరీస్ లో వరుసగా నాలుగు టెస్టుల్లో చూస్తే…మనవాళ్ల ప్రదర్శన ఇలా ఉంది.
1) యశస్వి జైశ్వాల్, 0,161, 0, 24, 4, 82, 84 ఇలా ఆడాడు.
2) రోహిత్ శర్మ మూడు టెస్టులే ఆడి… 3, 6, 10,3, 9 ఇలా పరుగులు చేశాడు.
3) కేఎల్ రాహుల్ అయితే పర్వాలేదనిపించాడు. తను వరుసగా నాలుగు టెస్టులు ఆడి 26, 77, 37, 7, 84, 24, 0 పరుగులు చేశాడు.
4) విరాట్ కొహ్లీ ని చూస్తే కొంచెం బాధగా ఉంది. తను వరుసగా నాలుగు టెస్టులు ఆడి 5, 100, 7,11,3, 24, 36, 5 పరుగులు చేశాడు.
5) రిషబ్ పంత్ పరిస్థితి అటూ, ఇటూ కాకుండా ఉంది. తను నాలుగు టెస్టులు ఆడి వరుసగా 37,1,21,28, 9, 28, 30 పరుగులు చేశాడు.
6) నితీశ్ కుమార్ మాత్రం చక్కగా ఆడాడు. నాలుగు టెస్టుల్లో వరుసగా 41, 38 నాటౌట్, 42, 42, 16, 114, 1 ఇలా ఆడి శభాష్ అనిపించాడు.
మరీ పరిస్థితుల్లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆఖరి టెస్టు మ్యాచ్ లో మనవాళ్లు ఎలా ఆడతారనేది ప్రశ్నార్థకంగా మారింది.