భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించిన ధీశాలి, సిక్సర్ల రారాజు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్టుగా నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగులు చూసి, తను మనస్థాపం చెందినట్టుగా భావిస్తున్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చే విమర్శలకు కలత చెందినట్టుగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
విషయం ఏమిటంటే, గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ లో విఫలమవుతున్నాడు. ఫామ్ కోల్పోయి అవస్థలు పడుతున్నాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా తిరిగి పామ్ అందుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో వరుసపెట్టి సిరీస్ లు కోల్పోతున్నారు. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, శ్రీలంకలో వన్డే సిరీస్, ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యాలతో సమాధానం చెప్పలేక, ఇక రిటైర్మెంట్ ప్రకటిద్దామని భావిస్తున్నాడు.
బహుశా జనవరి 3 నుంచి జరిగే ఆఖరి సిరీస్ లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. విషయం తెలిసిన బోర్డు పెద్దలు, కోచ్, ఇంకా సహచరులు సముదాయిస్తున్నట్టు సమాచారం. అదేదో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ తర్వాత ప్రకటించమని కోరుతున్నారు. అయితే రోహిత్ శర్మ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు.
ఇక్కడ చిన్న చిక్కుంది. బోర్డు పెద్దలు కోరుతున్నట్టు వరల్డ్ ఛాంపియన్ షిప్ వరకు ఆగాలంటే, అదంత ఈజీ కాదు. ఇప్పటికే టీమ్ ఇండియా రేస్ లో నిండా మునిగిపోయింది. ఒకవేళ చివరి టెస్టు గెలిస్తే ఏమైనా ఆశలు మిణుకుమిణుకు మంటూ మెరుస్తాయి. లేదు ఓడినా, డ్రా చేసినా రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ గెలిచినా, రేస్ లో నిలవాలంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే జనవరి ఆఖర్లో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే శ్రీలంక 2-0తో గెలిస్తే, వాళ్లు ఫైనల్ కి వెళతారు. ఆస్ట్రేలియా పరంగా చూస్తే, ఇండియాతో చివరి టెస్టు కలిపి , తనకింకా మూడు టెస్టులు ఉన్నాయి. వీటిలో ఒక్కటి గెలిచినా వాళ్లు ఫైనల్ కి వెళతారు. ఇది లెక్క. అందువల్ల ఆఖరి టెస్టులో టీమ్ ఇండియా గెలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.