తిరుమల తిరుపతిలోని శ్రీనివాసుడి దేవాలయంలో నూతన సంవత్సం ప్రారంభ రోజున ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. స్వామివారి దర్శనానికి సాధారణంగానే భక్తులను అనుమతించేలా టిటిడి ఏర్పాటు చేస్తోంది. రేపటి రోజున, అంటే జనవరి ఒకటో తేదీన ప్రత్యేక అలంకరణలు గానీ, ప్రత్యేక పూజలు గానీ శ్రీవారి ఆలయంలో నిర్వహించడం లేదు. మరోవైపు భక్తుల దర్శనాన్ని కూడా సాధారణ రోజుల తరహాలోనే అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు స్వయంభువై వెలసిన పుణ్యక్షేత్రం తిరుమల. స్వామివారిని దర్శించుకుంటే చాలు… అన్నీ శుభాలే కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు .ఇక నూతన సంవత్సరాది ప్రారంభం రోజున అయితే స్వామివారిని దర్శించుకుంటే చాలు.. ఇక ఆ ఏడాది అంతా తమకు మంచి జరుగుతుందని చాలామంది భక్తుల విశ్వాసం. అందుకే ముందు రోజే.. అంటే డిసెంబర్ 31వ తేదీనే చాలామంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఫలితంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లలోంచి వెలుపలకు భక్తులు వేచి ఉంటారు. సర్వదర్శనం కోసం గంటల తరబడి వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, ఇదంతా గతం అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి.
2016లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శ్రీవారి ఆలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో నూతన సంవత్సరాది ప్రారంభం రోజున ఎలాంటి హడావుడి చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటినుంచి ఆలయంలో ప్రత్యేక అలంకరణలను కూడా నిలిపివేసింది టీటీడీ. నూతన సంవత్సరాది ప్రారంభం రోజున చేసే పుష్ప, విద్యుత్ దీపాలంకరణను ఉగాది పర్వదినానికి మార్చివేసింది టీటీడీ. దీంతో నూతన సంవత్సరాది ప్రారంభం జనవరి ఒకటో తేదీకి ఉన్న ప్రాధాన్యత క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. అందుకే జనవరి ఒకటో తేదీన శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే విధానంలోనే పూజా కైంకర్యాలు నిర్వహించి ముందుగా సామాన్య భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. స్వామివారికి ఉదయం తిరుప్పావైతో మేల్కొలుపు పలికి తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి.. నైవేద్య సమర్పణ చేసిన అనంతరం శ్రీవారి దర్శనానికి ముందుగా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించనుంది టీటీడీ .అటు తర్వాత ఉదయం ఎనిమిది గంటల నుంచి సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించి పది గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మరోవైపు.. కొత్తసంవత్సరం ప్రారంభం రోజున విఐపిల తాకిడి కూడా అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. రేపటిరోజు అంటే కొత్త సంవత్సరం ప్రారంభం నాడు జనవరి ఒకటో తేదీన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రమే తిరుమలకు వస్తున్నట్లు ఇప్పటివరకు టీటీడీకి సమాచారం ఉంది. ప్రజాప్రతినిధులు దాదాపుగా నూతన సంవత్సరాది ప్రారంభ రోజున నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుండడంతో తిరుమలకు వచ్చే ప్రముఖుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక సామాన్య భక్తుల రద్దీ కూడా తక్కువగానే ఉంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం భక్తులకు లభిస్తుంది. శ్రీవాణి దర్శన టికెట్లకు కూడా డిమాండ్ తగ్గుముఖం పట్టింది. గత పది రోజులుగా ఉదయం 9 గంటలకే అయిపోతున్న శ్రీవాణి దర్శన టిక్కెట్లు.. రేపటికి ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఇక నడకదారిలో కూడా టోకెన్ల జారీ భక్తులకు అందుబాటులో ఉంది. ఇలా మొత్తంగా ఒకప్పుడు నూతన సంవత్సరం ప్రారంభం రోజున హడావుడిగా వుండే తిరుమలలో..ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.