కొద్దిరోజులుగా వరుస విమాన ప్రమాదాలు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. వరుసగా విమానాలు ప్రమాదాలకు గురికరావడం, ప్రయాణీకులు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ క్రమంలోనే మరో విమాన ప్రమాదం తృటిలో తప్పిపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో జరిగింది. ఒక విమానం రన్‌వేపై ఉండగా, మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆందోళనతో పైలట్‌ను హెచ్చరించాడు. “స్టాప్, స్టాప్, స్టాప్” అని ఆదేశాలు ఇచ్చాడు. ఈ ఘటన వాషింగ్టన్‌లోని గోంజగ విశ్వవిద్యాలయం మెన్స్ బాస్కెట్ బాల్ టీమ్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ రన్‌వేపై ఉండగా చోటు చేసుకుంది. అయితే, ఈ ప్రమాదం క్షణాల్లో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటన శుక్రవారం జరిగినప్పటికీ, ఆలస్యంగా బయటకి వచ్చింది. ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేపట్టింది. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆ సమయంలో రన్‌వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండడంతో, ప్రైవేట్ జెట్ “కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563″ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు రన్‌వేని దాటకుండా ఉండాలని సూచించారు. కానీ, అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ135 విమానం టేకాఫ్ కావడంతో, స్టాప్ అంటూ ప్రైవేట్ జెట్ పైలట్‌ను హెచ్చరించిన సిబ్బంది పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ సంఘటన అనంతరం, మొదటి విమానం టేకాఫ్ అయిన తర్వాత కాసేపటి తర్వాత ప్రైవేట్ జెట్ కూడా టేకాఫ్ అయ్యిందని అధికారులు తెలిపారు.