జగన్ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీపై నిరాకరించిన సుప్రీంకోర్టు
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదలాయించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అభ్యర్ధనను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. జస్టిస్, బీవీనాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం రఘురామ పిటీషన్‌పై విచారణ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు అసక్తికర వ్యాఖ్యలు చేసింది. జగన్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఈ కేసుల వ్యవహారం హైకోర్టు చూసుకుంటుందని, త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు. ఈ కేసుతో మీకు ఏం సంబంధమని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదిని సుప్రీకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కేసుల విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈ కేసులో వాదనలకు సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.