23.4 C
Hyderabad
Wednesday, November 4, 2026

Live Video

spot_img

త్రివేణీ సంగమం లో డిజిటల్‌ బాబా

  • మహాకుంభమేళాలో ఓ స్వామీజీ వినూత్న ప్రచారం
  • సోషల్‌ మీడియా వేదికలపైనుంచి ఆధ్యాత్మికత
  • యువత, చిన్న పిల్లలే టార్గెట్‌
  • మోడ్రన్‌ బాబాకు పెరుగుతున్న ఆదరణ
  • సోషల్‌ మీడియా హ్యాండిల్స్ లో మేళా విశేషాలు

ప్రయాగ్‌ రాజ్‌ మహాకుంభమేళాలో ఆధ్యాత్మికత పురులు విప్పుతోంది. యువతనుంచి నడివయస్కులు, వయోవృద్ధులు అందరిలోనూ ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరుస్తోంది. స్వామి రామ శంకర్‌ దాస్‌ అనే ఓ యువకుడు మాత్రం వినూత్న శైలిలో ఆధ్యాత్మిక ప్రచారం చేపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. డిజిటల్‌ బాబాగా పేరుపడిన ఈ యువకుడు ఆధునిక సామాజిక మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, యూ ట్యూబ్‌, ఎక్స్ ఇలా అన్ని పాపులర్ సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి మోడ్రన్‌ పద్ధతుల్లో ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తున్నాడు. సత్సంగ్‌ల కార్యక్రమాలను లైవ్‌ స్ట్రీమింగ్‌చేయడమే కాదు, ఆధ్యాత్మికతపై ఆలోచింప చేసేవిధంగా చర్చా వేదికలను కూడా నిర్వహిస్తున్నాడు. టెక్నాలజీని కలగలపిన ఈ ఆధ్యాత్మిక వాదం పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

గోరఖపూర్ యూనివర్సిటీ నుంచి బీకాం డిగ్రీ చేసిన రాంప్రకాష్‌ భట్‌ మొదట్లో ఈ ప్రపంచంలో దొరికే ప్రతి ప్రేమ వెనుక స్వార్ధం ఉంటుందని భావించినట్లు తెలిపాడు. స్వార్ధం లేని, బాధ్యతలులేని జీవితం కావాలని కోరుకుని దానికోసం అన్వేషణ జరిపినట్లు తెలిపాడు. అయితే చివరకు ఓ స్నేహితుని ద్వారా అయోధ్యలో మాష్‌ రిషి ఆశ్రంలోని స్వామి శివచరణ్ దాస్‌ని కలిసినట్లు వివరించాడు. ఆశ్రమంలో చేరిన కొత్తలో స్వాములందరూ తరతమ బేధాల్లేకుండా అన్ని పనులు చేసుకోవడం చూసి తాను చాలా నేర్చుకున్నానని రాం ప్రకాష్‌ భట్‌ తెలిపాడు. స్వామి శివచరణ్ దాస్‌ మహారాజ్‌ ఆశీర్వాదంతో దేశంలోని ప్రముఖ గురుకులాల్లో రామాయణ, భారత, భాగవత, ఉపనిషత్తులను ఔపోసన పట్టినట్లు తెలిపాడు. గుజరాత్‌ సబర్కాంతలోని వానప్రస్త సాధక గ్రామ్‌ ఆశ్రమం, హర్యానాలోని కల్వా గురుకుల్‌, హిమాలయా గురుకులంలోని సాందీపని ఆశ్రమం, హిమాచల్‌ప్రదేశ్ లోని ధర్మశాలలోని చిన్మయ మిషన్, బీహార్‌ రిఖియా పీఠ్‌ లోనూ, మహారాష్ట్ర లోనావాలాలోని కైవల్యధామ యోగా సంస్థాన్లలో తాను శిక్షణ పొందినట్లు రాం ప్రకాష్‌ భట్‌ తెలిపాడు.

ఇవాల్టి తరం ఎక్కువగా సోషల్‌ మీడియాలోనే ఉంటోందని అందుకని అదే మీడియా ద్వారా ఆధ్యాత్మికతను చొప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ఈ డిజిటల్‌ బాబాకు ప్రత్యేకమైన సిబ్బంది ఎవరూ లేరు. ఆయనే త్రివేణీ సంగమం దగ్గర ఓ ట్రైపాడ్‌, ఓ మైక్రోఫోన్‌, మొబైల్‌ సాధనాలతో కనిపిస్తున్నాడు. కుంభమేళాకు వచ్చే వారిని తరచుగా ఇంటర్వ్యూలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. యువత ముఖ్యంగా కుర్రకారును ఆధ్యాత్మికతపై పలు ప్రశ్నలు వేసి వారిలో ఆలోచించే తత్వాన్ని పెంచుతున్నాడు. జీవితం అంటే సంపాదనే కాదని, చదువుకుని ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనగానే జీవితం సార్ధకత అయిపోదని మనలో ఉండే ఆధ్యాత్మిక శక్తులను బయటకు తీయాలని, మనల్ని మనం క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాలని డిజిటల్‌ బాబా చెబుతున్నాడు. జీవితం అంటే సుఖప్రయాణం కానేకాదని, కష్టాలు, సుఖాలు రెండూ ఉంటాయని డిజిటల్‌ బాబా అంటున్నాడు. అందరూ మానసిక స్థిరత్వాన్ని సంపాదించుకుంటేనే కష్టాల్లో కూడా నిలదొక్కుకునే సత్తా పెరుగుతుందని అన్నాడు. చిన్న పిల్లలు ధర్మ సంస్కారానికి బద్ధులై జీవించాలని ఆయన పిలుపునిచ్చాడు.

కుంభమేళాలో కమర్షియల్‌ స్వాములు

నేడు స్వామీజీలు కూడా కమర్షియల్‌ గా మారిపోయారని ఆధ్యాత్మికతను బోధించేందుకు లక్షా, రెండు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారని, కుంభమేళాకు కార్లలో వస్తున్న స్వామీజీలను చూశాననీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ భోగ భాగ్యాలన్నీ ఇంకా ఐహిక సుఖాలపై ఉన్న మోజును తెలియ చేస్తున్నాయని, వారిలో నిరాడంబరత్వం లేదని, ఆడంబరమే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సనాతన ధర్మం, ఆధ్యాత్మిక వాదం పెంపొందిండమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ డిజిటల్‌ బాబాకు ఫేస్‌ బుక్‌ లో మూడన్నర లక్షల మంది ఫాలోయర్లు, యూట్యూబులో 30 వేలమంది, ఇన్ స్టా గ్రామ్‌ లో 14 వేలమంది, ఎక్స్ లో 3వేలమంది ఫాలోయర్లు ఉన్నారు. అందరిలోనూ అంతర్గత శుద్ధి, ఆత్మశుద్ధి కలిగినప్పుడే కుల రహిత సమాజం సాధ్యమని ఈ బాబా నమ్ముతున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com