కాటేరమ్మ కొడుకులుగా.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటమే ధ్యేయంగా గ్రౌండ్‌లోకి దిగుతారని పేరున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లకు.. ప్రస్తుతం వారు ఆడుతున్న ఆటకు అసలు సంబంధమే లేదనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి ఆట తీరు ఇప్పుడు విమర్శలకు కారణమవుతుంది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడం పక్కన పెడితే.. కనీసం వేగంగా నడిపించలేకపోయారు.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ ఎంతటి ప్రమాదకరమో అందరికి తెలుసు. కానీ ఈ జోడి ఈ మధ్య వరుసగా ఫెయిలవుతుంది. MIతో జరిగి మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. స్లో పిచ్ దెబ్బకు ఈ జోడి పవర్ ప్లేలో కేవలం 46 పరుగులు మాత్రమే చేసింది. వీరిద్దరు 8 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా స్కోర్ పరుగులు పెట్టలేదు. ఇద్దరికి లైఫ్‌లు దొరకడంతో ఈ అవకాశాన్ని అయినా వాడుకుంటారంటే.. అదీ జరగలేదు. ఇషాన్ కిషన్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంప్స్ దగ్గర దొరికిపోయాడు. నితీష్ కూడా నిరాశపరిచాడు. విల్ జాక్స్‌తో పాటు ముంబై బౌలర్లంతా SRH బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. జాక్స్‌తో పాటు ముంబై పేసర్లు మధ్య ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ను కట్టడిచేశారు. చాహర్ వేసిన 18వ ఓవర్లో ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్ నమోదు అయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. ఈ ఓవర్‌లో 21 పరుగులు రావడంతో మ్యాచ్‌లో ఆ మాత్రమైనా స్కోర్ వచ్చింది. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించింది. 300 పక్కా అని చెప్పిన టీమ్.. అందులో సగం స్కోర్ నమోదు చేయడానికే ఆపసోపాలు పడింది.
ఏ పిచ్‌పై అయితే SRH బ్యాటర్లు స్కోర్ చేయడానికి కష్టపడ్డారో అదే పిచ్‌పై ఈజీగా రన్స్ రాబట్టారు ముంబై బ్యాటర్లు. రోహిత్ 26, రికెట్లన్ 31 పరుగులు పచేశారు. రికెల్టన్ అయితే ఇషాన్ మలింగ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. హర్షల్ ఓవర్‌లో కూడా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాది.. ఔటయ్యాడు. ఇక క్రీజులో ఉన్న సూర్య, విల్ జాక్స్ కూడా వేగంగా ఆడారు. హార్దిక్ కేవలం 9 బంతులే ఆడిన మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆఖర్లో తిలక్ వర్మ మ్యాచ్‌ను ముగించాడు. 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది MI.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇది ఐదో ఓటమి. లాస్ట్ మ్యాచ్‌లో పంజాబ్‌పై సూపర్ విక్టరీ సాధించిన SRH.. ఈసారి మాత్రం బోల్తా పడింది. తరువాత ఆడబోయే 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇక ముంబై వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోష్‌లోకి వచ్చింది. ఇదే జోష్‌ను కొనసాగిస్తే తప్ప.. ముంబై ప్లేఆఫ్స్ ఆశలు కూడా కష్టమే.