తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ పరువు తగ్గించేలా వ్యవహరించడం అర్థరహితం అని, ఇటువంటి వ్యవహారం తగదని గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై గంటా శ్రీనివాసరావు ఓ ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే, మధ్యలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దాటి రావాల్సి వస్తోంది. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి, హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. ఇదే పరిస్థితిని సీఐఐ, ఫిక్కీ ట్రేడ్ ప్రతినిధులు కూడా ఎదుర్కొన్నారు. విశాఖ-విజయవాడ మధ్య విమానాలు రద్దు, వందేభారత్ రైలు లేకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది అవుతోంది.” అని గంటా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ వైరల్ కావడంతో, టీడీపీ నాయకత్వం గంటాపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్న సొంత పార్టీపై ఇలా విమర్శించడమేమిటని ప్రశ్నించింది. ముఖ్యంగా కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉన్న వేళ, పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు – ఇలా పబ్లిక్‌గా కామెంట్లు చేయడం తగదని టీడీపీ అధిష్టానం తీవ్రంగానే మందలించినట్లు సమాచారం.
ఇలాంటి సమస్యల్ని పార్టీ అంతర్గతంగా, లేదా సంబంధిత మంత్రితో చర్చించాల్సిందే తప్ప, సోషల్ మీడియాకు ఎక్కడం సరికాదని టీడీపీ అభిప్రాయపడింది. గంటా చేసిన ట్వీట్ కావాలనే ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేసినట్లు భావించినట్లు సమాచారం. ఈ విషయంపై గంటా శ్రీనివాసరావును వివరణ అడిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి గంటా శ్రీనివాసరావు ట్వీట్ టీడీపీలో పెద్ద చర్చకు దారితీసింది.