-
‘పింక్‌బుక్’ అంటూ కార్యకర్తల్లో జోష్ నింపే యత్నం
-
తదుపరి పాదయాత్ర ప్లాన్
రాజకీయాల్లో విజయం సాధించేందుకు ఒక సక్సెస్ ఫార్ములా, ఫార్మాట్ ఉంటుంది. దాన్ని అనుసరిస్తే విజయం సాధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మార్గాన్ని తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఫాలో కావాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఏపీ ప్రతిపక్ష నేత నారా లోకేష్ గత ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ అనే పుస్తకంతో ప్రజల్లోకి వెళ్లారు. చట్టాన్ని ఉల్లంఘించినవారి పేర్లను అందులో నమోదు చేశానని, తాము అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పట్లో చంద్రబాబు మంచి వ్యక్తి అని, తానే కాస్త గట్టిగా ఉంటానని లోకేష్ చెప్పిన మాటలు క్యాడర్ మనసుల్లో నాటుకుపోయాయి. అందుకే ఆయనకి మంచి ఇమేజ్ వచ్చింది.
ఇప్పుడదే తరహాలో తెలంగాణలో కల్వకుంట్ల కవిత ‘పింక్ బుక్’ పేరుతో రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. ఆమె కూడా కేసీఆర్ మంచోడేనని, తానే కాస్త రౌడీ టైప్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాతావరణం వేడెక్కుతుండగా, కవిత పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడం, కాంగ్రెస్ నేతలను హెచ్చరించడం చూస్తే లోకేష్ మాదిరి రాజకీయాన్ని ఆమె ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా కవిత చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరు కాకుండా బెదిరింపులు వస్తున్నాయని, ఎవరు బెదిరిస్తున్నారో వారి పేర్లను పింక్ బుక్‌లో రాసేస్తామన్నారు. అలాగే తమ పార్టీ కార్యకర్తలను, నేతలను వేధించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అయితే, ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, కవిత కూడా పాదయాత్ర చేయాలనుకుంటోందని ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నారని సమాచారం. కవిత అయితే ప్రధానంగా ఇప్పుడు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారని చర్చ నడుస్తోంది.
మొత్తానికి, నారా లోకేష్ ఫార్ములా ఇప్పుడు తెలంగాణలో కూడా చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ నేతలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తమ ‘పింక్ బుక్’లో పేర్లు నమోదు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.