23.2 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

ఏమయ్యారీ సోషల్‌ మీడియా సెన్సేషన్స్?

  • ఇలా వెలుగులోకి వచ్చి అలా పాపులర్
  • పబ్లిసిటీ సాధనాలుగా రీల్స్, షార్ట్స్
  • కొంచెం టాలెంట్‌ ఉంటే చాలు..
  • ఈమధ్యకాలంలో విపరీతంగా ఈ రకమైన ఫ్లో
  • ఆతర్వాత అడ్రస్ లేకుండా పోతున్నవైనం
  • సోషల్‌ మీడియా టాలెంట్‌ హంటరా లేక కిల్లరా ?

ఈ రోజుల్లో ఫేమస్ అవ్వాలంటే పెద్ద పెద్ద పనులు చేయనక్కర లేదు. కాస్త రొటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తే చాలు. సోషల్‌ మీడియా దానంతట అదే నెత్తికెత్తుకుంటుంది. మనకి కావలసినంత ప్రచారం కల్పించేస్తుంది. అది మంచిదా, చెడుదా అన్నది వేరే సంగతి. ఇన్ స్టాంట్‌ పబ్లిసిటీ కావాలంటే సోషల్‌ మీడియానే దిక్కు. కాస్త భిన్నంగా, వెరైటీగా కనిపిస్తే చాలు జనం ఎగబడి చూస్తారు. విపరీతంగా ఎంకరేజ్ చేస్తారు. మొన్నా మధ్య తెలంగాణలో పాలమూరు జిల్లాకు చెందిన బర్రెలక్క అనే ఓ డిగ్రీ హోల్డర్ ఇలాగే పాపులర్ అయింది. డిగ్రీ చేసినా సరైన ఉద్యోగం లేదని బాధపడిన ఈ యువతి పల్లెటూళ్లో నాలుగు బర్రెలు మేపుకుంటూ రీల్స్, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్లోడ్‌ చేసింది. ఇంకేముంది? జనం నత్తి కెత్తుకున్నారు. బర్రెలక్క పేరుతో ఆమెకు అక్కరలేనంత పబ్లిసిటీ కల్పించారు. ఆ పబ్లిసిటీ ముదిరి చివరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం ఆమె సిద్ధపడింది. ఆమెకు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు సైతం ప్రచారం చేశారు. ఎదుగుతున్న యువతకు ప్రతిబింబంగా ఆమెను చూశారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె ఎన్నికల్లో గెలవలేదు సరికదా.. ఆ తర్వాత ఆమె ఎమైందో కూడా తెలీదు.

మోనాలీసా… కహాహో తుమ్?

అలాగే కుంభమేళా పుణ్యమాని మోనాలీసా అనే పూసలమ్ముకునే యువతి యమ పాపులర్ అయిపోయింది.క్రేజీ సోషల్‌ మీడియా ఆమెను ఆకాశానికెత్తేసింది. ఎంతలా అంటే చివరకు ఆమె ప్రైవసీ కోల్పోయాను బాబోయ్ నన్ను వదిలిపెట్టండని బతిమాలుకునేంతలా. మోనాలీసా కు చివరకు భద్రతా పరమైన సమస్యలూ ఎక్కువయ్యాయి. దాంతో కుంభమేళా నుంచే ఆమెను తండ్రి సొంత ఊరు ఇండోర్ కు పంపించి అక్కడ ఇంట్లో ఉంచాడు. అదీ సంగతి.. ఒకళ్లు అందుకుంటే ఇక వరసగా ఇతర మీడియా వారూ నెత్తికెత్తేస్తారు. మోసాలీసాకు సినిమాల్లో ఆఫర్లు వచ్చేశాయి అనే మాటలు కూడా వినిపించాయి. కానీ అవేమీ కార్యరూపం మాత్రం దాల్చలేదు.

అఘోరీ హల్ చల్

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అఘోరీ ఉదంతాన్నే తీసుకుంటే ఒంటికి బూడిద రాసుకుని హరహర మహదేవ్ అంటూ ఓ విచిత్రమైన కారులో తిరుగుతూ ఒకామె/ఒకాయన ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.తన దగ్గర శక్తులున్నాయని, ఆడపిల్లల రక్షణ, గోసంరక్షణ అంటూ హడావుడి పడుతున్న ఘటనలు సంచలనంగా మారాయి. చివరకు వర్షిణి అనే బీ టెక్ స్టూడెంట్ ఆఅఘోరీ మాయలో పడి సాధన నేర్చుకుంటానంటూ ఇల్లు వదిలి వెళ్లి నానా హంగామా సృష్టించింది. అఘోరి అంతా పచ్చి మోసమని బాధిత కుటుంబం గగ్గోలు పెట్టింది. చివరకు ఆమెను వెనక్కుతీసుకొచ్చారు. అయినా అఘోరీ ఆవర్షిణి వెంట పడుతూ, ఎత్తుకు పోతానని, ఎవరూ తమను విడదీయలేరని ఏదో రకంగా బెదిరిస్తోంది. ఆమెకు కొందరు రాజకీయ నేతలు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారి మద్దతు ఉందనే విషయం కూడా సోషల్‌ మీడియా, ఇతర మీడియా ఛానెళ్లు పరిశోధనలో కనుగొన్నాయి.ప్రస్తుతానికి అఘోరినే ట్రెండింగ్‌ టాపిక్.

కుమారీ ఆంటీ కూడా అంతే!

హైటెక్ సిటీలో కుమారీ ఆంటీ అని ఫుడ్‌ స్టాల్‌ పెట్టుకుని జీవించే మధ్యతరగతి మహిళ యమా పాపులర్ అయింది. ఆమెకు ఎక్కడలేని పబ్లిసిటీ కల్పించినది సోషల్‌ మీడియానే.ఆమె వంటలకు,అతి తక్కువ ధరలతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నారంటూ మొన్నామధ్య ఆకాశానికెత్తేశారు.ఇంకేముంది మధ్యతరగతి కుర్రకారంతా కుమారీ ఆంటీ అదరహో అంటూ ప్రచారం చేశారు. ఎంతలా అంటే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌ రెడ్డి కూడా ఆమె స్టాల్‌ను సందర్శించేంతలా.. సీఎం అయ్యాక రేవంత్‌ ఆమె ను తప్పక కలుస్తానని మాట ఇచ్చినట్లు కూడా వార్తలువచ్చాయి. మరిప్పుడామె సరైన బిజినెస్ లేక దివాళా తీసిందని తెలుస్తోంది.

సింగర్ బేబీ ఎక్కడ?

ఇంకా వెనక్కి వెళితే పొలంలో కూలి పనులు చేసుకునే బేబీ అనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళను సోషల్‌ మీడియానే ఆకాశానికెత్తేసింది.ఏదో కూలీ నాలీ చేసుకుంటూ అలసట తీరేందుకు ఆమె పాడిన పాటను చుట్టుపక్కల వారు రికార్డు చేసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో ఆమె టాలెంట్‌ ఖండాంతరాలకు పాకింది. ఆమె పాటలు ఏ ఫేమస్ సింగర్ కీ తీసిపోవని మీడియా ఛానెళ్లు గంటల తరబడి లైవ్ షోలు కూడా నడిపాయి.ఒకరిద్దరు వర్ధమాన డైరక్టర్లు,మ్యుజీషియన్లు కూడా ఆమెకు అరా ఒకటి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత మరిప్పుడు ఆమె ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు.
ఇలాంటి సంఘటనలు మన తెలుగు మీడియాలోనే కాదు అటూ బాలీవుడ్‌ లోనూ జరిగాయి. రోడ్డు మీద ముసలి వయసులో ఉన్న ఓ యాచకుడు రఫీ గీతాలు అత్యద్భుతంగా పాడి ఫేమస్ అయ్యాడు.పేరు పెద్దగా పాపులర్ కాకపోయినా, అతగాడిని అభినవ రఫీ అంటూ సోషల్‌ మీడియా ఆకాశానికెత్తేసింది.
ఇలాంటిదే మరో ఘటన.. అలేఖ్య అనే ఇద్దరు ట్విన్స్ సోషల్‌ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. వారిద్దరూ అట్టహాసంగా పచ్చళ్ల బిజినెస్ లోకి కూడా దిగారు. కాకపోతే ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.

అలేఖ్య చిట్టి పికిల్స్

ముగ్గురు అక్కా చెల్లెళ్ళు… సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చేస్తూ పాపులర్ అయ్యారు. ఆ పాపులారిటీని ఉపయోగించుకుని పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించారు. సోషల్ మీడియా అదనుతో అందులో కూడా సక్సెస్ అయ్యారు. కానీ ఈ అక్కా చెల్లెళ్ళలో ఒకరి తొందరపాటు వల్ల అదే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో పెట్టాలంటే భయపడే స్ధితికి చేరుకున్నారు.

కచ్ఛా బాదం భుబన్

పశ్చిమబెంగాల్ లోని ఓ పల్లెటూరులో నివశించే భుబన్ బద్యేకర్ ఓ చిరు వ్యాపారి. ఊరూరు తిరుగుతూ పల్లీలు అమ్ముకునే వాడు. అమ్ముకునే క్రమంలో కొనుగోలు దారులను ఆకర్షించడానికి పల్లీలను ఉద్దేశిస్తూ కచ్చా బాదం అని పాట అసువుగా పాడి రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు. అతని కచ్చా బాదం పాట విన్న పలువురు బాలీవుడ్ పాప్ ఆల్బమ్ మేకర్స్ అతని ఆహార్యాన్ని మార్పించి పాటలు చిత్రీకరించారు. అవి కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఇప్పుడు ఆయన పశ్చిమ బెంగాల్ లోని తన స్వగ్రామం దుబ్రాజ్పూర్ లో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటూ మళ్ళీ తన వ్యాపారం తాను చేసుకుంటున్నాడు.

ఏతా వాతా తేలేదేమంటే ఎవరినైనా పాపులర్ చేసేశక్తి సోషల్‌ మీడియాకుంది.అయితే ఆ తర్వాత ఆ పాపులారిటీని, పబ్లిసిటీని జాగ్రత్తగా ఉపయోగించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటేనే ఎవరైనా రాణించేది. మనలో టాలెంట్‌ ని గుర్తించడానికి అదో మీడియా. ప్రచారానికి అదో వేదిక అంతవరకే.. ఆ తర్వాత ఎవరైనా స్వశక్తితోనే రాణించేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com