మహ్మద్ షమీ.. అతని రీ ఎంట్రీ కోసం ఎదురు చూడని క్రికెట్ ఫ్యాన్ లేడనే చెప్పాలి. అలాంటి షమీని ఇంగ్లండ్ సిరీస్‌కు సెలెక్ట్ చేయగానే అందరి ఆనందం అంతా ఇంతా కాదు. షమీ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. అతని ప్రాక్టీస్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తీరా మొదటి మ్యాచ్ ఫైనల్ టీమ్‌లో మాత్రం షమీకి చోటు దక్కలేదు. దీంతో మళ్లీ అనేక డౌట్స్ తెరపైకి వచ్చాయి. అసలు షమీకి ఏమైంది? గాయం ఇంకా మానలేదా? అందుకే మ్యాచ్ ఆడలేదా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల బుర్రల్లో చక్కర్లు కొడుతున్నాయి.
షమీ ఆడకపోవడానికి పెద్దగా స్పెషల్ రీజన్స్ ఏమీ లేవని.. టీమ్‌లో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలని టీమ్ అనుకోవడం వల్లే షమీకి రెస్ట్ ఇచ్చారని అభిషేక్ శర్మ మ్యాచ్ ముగిసిన తర్వాత చెప్పాడు. మ్యాచ్‌కు ముందు కూడా షమీ ఆడటం లేదని చెప్పాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. మ్యాచ్ జరిగే ప్రాంతం పరిస్థితులు, వాతావరణం బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు సూర్య. ఫైనల్ టీమ్‌ను సెలెక్ట్ చేయడం కాస్త తలనొప్పిగా మారిందని.. షమీ, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు మ్యాచ్ ఆడటం లేదని తెలిపాడు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని.. మరే కారణం లేదన్నాడు సూర్య.
ఈ మాటలు విన్న తర్వాత షమీకి ఎలాంటి ఇబ్బందులు లేవని తేలిపోయింది. గాయం కారణంగా కాదు.. కేవలం టీమ్ కాంబినేషన్లో భాగంగానే అతడిని పక్కన పెట్టినట్టు అర్థమవుతుంది. అయితే షమీ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. దీంతో అతని సత్తాను చూడాలని ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్న విషయమైతే వాస్తవం. మరి రెండో టీ20లో షమీ ఆడతాడా? లేదా? చూడాలి.