36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

సూపర్ సిక్స్ పథకాల పేరిట వంచన…జక్కంపూడి రాజా

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడిచిన సాధారణ ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు,రాజానగరం మాజీ శాసన సభ్యులు   జక్కంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్ లోని ది.రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉండడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మరోసారి రుజువైందన్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారని,సంపద సృష్టిస్తామని నమ్మబలి కారని,భవిష్యత్ గ్యారంటీ అంటూ గొప్పలు చెప్పారని,ఎనిమిది నెలలు గడిచినా ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. అమ్మఒడి,విద్యాదీవెన, విద్యా వసతి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు జమచేసారని, ముఖ్యంగా అమ్మఒడి వంటి పథకాలతో వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు తీసి,సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకునేవారని జక్కంపూడి రాజా వివరించారు.అయితే ఇది తట్టుకోలేని చంద్రబాబు రాష్ట్రం మరో శ్రీలంకగా మారి పోతుందని,బీహార్ గా మారిందని ఇష్టం వచ్చినట్లు జగన్ మీద వైసిపి మీద  అబద్ధాలు ప్రచారం చేసి తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని నమ్మబలికారని ఆయన విమర్శించారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రజలకు పథకాలు అమలు చేయకపోవడం వలన సామాన్య ప్రజలకు డబ్బుల్లేకుండా పోయాయని ఫలితంగా ఒకప్పుడు కళకళ లాడిన  మార్కెట్లు ఇప్పుడు వెలవెల బోయాయని జక్కంపూడి రాజా వాపోయారు. ఏ ఒక్క షాపులో కూడా గిరాకీ లేకుండా పోయిందన్నారు.పైగా సంక్రాంతి పండగకు గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో కోడిపందేలు, పేకాట, గుండాట,వంటి జూద శిబిరాలు ఏర్పాటుచేసి కూటమి నాయకులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచేశారని ఆయన ఆరోపించారు.

గుండాటలో డబ్బులు పోగొట్టుకుని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడితే, కోడిపందేల్లో డబ్బులు ఇవ్వలేదని మరో యువకుడు పీక కోసుకున్నాడని ఆయన ఆధారాలతో ప్రస్తావిస్తూ,ఇదేనా కూటమి పాలన అని నిలదీశారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2వేల బరులు ఏర్పాటుచేస్తే,అందులో 400వరకు బడులనే కేంద్రంగా చేసుకుని జూదాలు నడిపారని ఆయన ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా 400కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి మద్యం అమ్మకాలు సాగినట్లు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే పత్రికలోనే వచ్చిందని జక్కంపూడి రాజా సదరు పత్రిక వార్తను చదివి విన్పించారు.సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

బరుల దగ్గర పోలీసులను పక్కకు గెంటేయడం, తోసెయ్యడం వంటివి చూస్తుంటే,అసలు లా ఆర్డర్ ఉందా అని ఆయన నిలదీశారు. రాజానగరం నియోజక వర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని,ఇక సంక్రాంతికి అయితే అన్నిచోట్లా బరులు ఏర్పాటుచేసి,ఒక్కొక్కడు రూ 10లక్షల నుంచి కోటి రూపాయల వరకు వేలం పెట్టి మరీ వసూలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రూ 10కోట్లు దండుకున్నారని జక్కంపూడి రాజా తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము వసూలు చేసుకోవాలి కదా అని చెబుతున్నట్లు తెలుస్తోందని ఆయన వాపోయారు.రాజానగరంలో ఎప్పుడు లేని విధం గా డ్రగ్స్,రేవు పార్టీలు, జూదాలు జరిగాయని అనకాపల్లిలో పట్టుకున్న గంజాయి మూలాలు కాపవరంలో జనసేన నాయకుడు దగ్గర మూలాలు వున్నయన్నారు…

వి.ఆర్.ఓ పోస్టు మొదలుకుని సి.ఐ పోస్టు వరకు డబ్బులు వసూలు చేయడం వలన అన్ని ఆఫీసుల్లో పనికి ఇంత అనేరీతిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. పెనమలూరులో బరుల దగ్గర జనసేన జెండాలు ప్రదర్శించారన్న సాకుతో ఒకర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారని, అయితే పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా సాగిన బరుల వ్యవహారం లో టీడిపీ,జనసేన నేతల తీరుకు ఏమిచర్యలు తీసుకుంటారని జక్కంపూడి రాజా ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజానగరం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని,అలాగే కూటమి నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేసారు. పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేసారు. గతంలో చేసిన వేతన ఒప్పందం కంటే తక్కువ చేస్తామనడం సమంజసం కాదన్నారు. ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి ఒక బ్రోకర్ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అతడి కారణంగానే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. నిజానికి తమ పార్టీ అధికారంలో ఉండగానే కార్మికులకు వేతన ఒప్పందం జరిగి ఉండాల్సిందని,అంతర్గత రాజకీయాల వలన కుదరనందుకు బాధగానే ఉందని ఆయన అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి డైరెక్షన్ లో ప్రవీణ్ చౌదరి నడిచేవాడని ఆయన అన్నారు.అయితే కార్మికులకు చేసిన అన్యాయం నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోడానికి  వైసిపిని ఆశ్రయించాలని ప్రవీణ్ చౌదరి ప్రయత్నం చేయడంతో, తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. దాంతో వేరే మార్గం ద్వారా పార్టీలోకి వచ్చాడన్నారు.

పేపరుమిల్లుకార్మికులతో  తన తండ్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన రావు కు గల అనుబంధం, కారణంగానే కార్మికుల న్యాయమైన కోర్కెల సాధనకు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. కార్మికుల శ్రమతో కోట్లకు కోట్లు లాభాలు గడిస్తున్న యాజమాన్యం కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి తీరాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com