కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించి అనుమతులు, నిధులు దశాబ్దకాలంగా అపరిశుభ్రంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా తాను, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పలు వేదికల్లో ప్రధాని మోదీ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రులందరి దృష్టికి తీసుకు వెళ్ళామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రీజినల్ రింగ్ రోడ్డు, వరంగల్ టెక్స్‌టైల్స్ పార్క్, నవోదయ స్కూల్స్ వంటి అనేక అంశాలకు సంబంధించి పలుమార్లు విన్నవించిన లాజికల్ కంక్లూజన్ రాలేదన్నారు. ప్రజాభవన్‌లో అఖిలపక్ష ఎంపీల సమావేశంలో భట్టి విక్రమార్క పలు అంశాలను ఎంపీలకు వివరించారు.
రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారని, రాష్ట్రం లబ్ది పొందడానికి తాము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇదన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్, బీజేపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులను స్వయంగా ఆహ్వానించానని.. అయితే, కొన్ని కారణాల వల్ల రావడం లేదని కొద్దిమంది తెలిపారన్నారు. తక్కువ సమయంలో సమాచారం ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ ద్వారా తెలియజేశారన్నారు.
ఈ సమావేశం రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసింది కాదని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అయినా కేంద్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉన్నదన్నారు. రాష్ట్ర ఎంపీలంతా కలిస్తేనే వీటిని సాధించేందుకు అవకాశం ఉంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లే లోపు పార్టీలకు అతీతంగా ఎంపీలందరికీ అపరిష్కృత అంశాలపై పూర్తి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖ ద్వారా అందజేస్తుందన్నారు.
భవిష్యత్తులో పార్లమెంటు సమావేశాలకు ముందు, సభ్యులందరికీ మంచి సమయం ఇచ్చి ముందస్తుగా తెలియజేసి ఎంపీల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం. పార్లమెంట్‌లో ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నలకు అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అవసరమైన సమాచారాన్ని అందించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు లేదా సమావేశాల మధ్యలో ఢిల్లీలో అఖిలపక్ష పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.