39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం – భట్టి విక్రమార్క

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన బిఆర్ఎస్ ఏరోజు మహిళా అభ్యున్నతి గురించి కానీ, డ్వాక్రా సంఘాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్దపీట వేశామన్నార. వడ్డీ లేని రుణాలు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించిన ఐకేపి పథకాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఐకెపి, స్వయం సహాయక సంఘాల గురించి మాట్లాడటానికి కూడా అసెంబ్లీలో గత పాలకులు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సమయం ఇవ్వకుండా నియంతృత్వంగా వ్యవహరించారని మండిపడ్డారు. పది సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ ఆదాయం, చేసిన ఏడు లక్షల కోట్ల అప్పును పంది కొక్కుల్లా తిన్నారే తప్ప, మహిళల ఆర్దిక సాధికారతకు ఏమి చేయలేదన్నారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆశలు నెరవేరుతాయన్న మహిళల ఆకాంక్షలను ప్రజా ప్రభుత్వ నెరవేరుస్తున్నదన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఈ ఏడాది 20వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 20వేల కోట్లు ఇవ్వడం సాధ్యమేనా అంటూ హేళన చేస్తూ నవ్వారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు పందికొక్కుల్లా ప్రభుత్వ ఖజానాను తిన్నారని. పది సంవత్సరాల కాలంలో కనీసం 10 వేల కోట్లు కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. కానీ, 20వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పిన ప్రజా ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. 21 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం అనేది ఆశ, మాషి కాదని, ఎంతో సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇది మాకు సాధ్యమైందన్నారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాదు. ఇచ్చిన రుణాలను వ్యాపారం చేసుకోవడానికి ప్రజా ప్రభుత్వం మార్గం చూపించిందన్నారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా ఆ బస్సులకు యజమానులను చేసిన ఘనత కూడా ప్రజా ప్రభుత్వానిదన్నారు. మహిళా సమాఖ్యాలతో 600 బస్సులు కొనుగోలు చేయించిన చరిత్ర దేశంలో ఎక్కడ లేదన్నారు.
రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా వెలుగులు నింపే న్యూ ఎనర్జీ పాలసీని మన ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  విద్యుత్ శాఖ, మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న నన్ను, మంత్రి సీతక్క ను పిలిచి మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలను సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములు చేయాలని చెప్పడంతో  1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఎంఓయూ చేయించామని భట్టి చెప్పారు.

దేశంలో బడా పెట్టుబడిదారులైన అంబానీ, ఆదానిలే కాదు.. రాష్ట్రంలో మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం దేశంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతున్నదన్నారు. బహిరంగ మార్కెట్లో మహిళలు గత బి ఆర్ ఎస్ పాలనలో నూటికి పది రూపాయల చొప్పున వడ్డీ తెచ్చుకొని వాటిని తీర్చలేక బాధపడే దుష్ఠాంతం నుంచి వడ్డీ లేకుండా 21 వేల కోట్ల రుణాలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధికి మహిళలు పునాది కావాలని ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ హైటెక్ సిటీలో విలువైన ప్రాంతాన్ని కేటాయించి డ్వాక్రా బజార్ ప్రారంభించామననారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ బడుల బాధ్యత అప్పగించామని, మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టించాం. విద్యార్థుల యూనిఫార్మ్స్  కుట్టే పనిని అప్పగించి మహిళల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసిన ప్రభుత్వం మనదన్నారు.

రాష్ట్రంలో మహిళలు తలెత్తుకొని మహాలక్ష్మి గా గౌరవంగా బతకాలన్నదే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన అన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావు బడ్తాలాగా పెరిగాడే తప్పా, మహిళలకు కనీసం పది వేల కోట్ల రుణాలు ఇప్పించలేదన్నారు. ప్రజా ప్రభుత్వం రూపాయి, రూపాయి పోగేసి సృష్టించిన సంపదను ప్రజల కోసం ఖర్చు చేస్తుండగా ప్రజలు బాగు పడటాన్ని చూసి ఓర్వలేక, సమాజం బాగుపడితే మా దగ్గర గులాం చేసేవారు మిగలరనే కుట్రతో ప్రజా ప్రభుత్వం పై అవాక్కులు- చెవాకులు మాట్లాడుతున్నారని, మీరు పదేండ్లు చేసిన పాపాలు, అవినీతి గురించి లెక్కలతో సహా చెబుతామని బీఆర్‌ఎస్‌కు వార్నింగ్ ఇచ్చారు.

గత బిఆర్ఎస్ పాలకులు వాళ్ల పిల్లలను అమెరికాలో చదివించడం, పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలో చదివించారే తప్పా, ఏ ఒక్క రోజు పేద బిడ్డల చదువుల కోసం ఆలోచన చేయలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోఠిలో ఉన్న మహిళా యూనివర్సిటీకి తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం  చేశామన్నారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యా బోధన వసతులు కల్పించడానికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు యూనివర్సిటీని సందర్శించారని చెప్పారు. పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమే కాకుండా బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని బిఆర్ఎస్ లాగా గాలి మాటలు చెప్పడం లేదని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని, పనులు ప్రారంభించామని, ఇది మా ప్రభుత్వానికి ఉన్న అంకితభావం అని స్పష్టం చేశారు. లక్ష కోట్లకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి మహిళ అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతులు నిరుద్యోగులు మహిళలు అనేక వర్గాల ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు గుండెల్లో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల దోపిడిని గత పది సంవత్సరాలు చూశామని, దొరల పాలనను మళ్లీ రానీయోద్దని కోరారు. పేదలు లబ్ది పొందేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకుందామని భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com