- సాగును లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం…
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానించి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్ మినిస్ట్రీ ఏషియా హెడ్ రెబెకా రిడ్డర్ ఆధ్వర్యంలో జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమర్జింగ్ టెక్నాలజీతో అన్ని రంగాల పరిశ్రమలను అనుసంధానించేందుకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. రాష్ట్రంలో సుమారు 55 శాతం నుంచి 60 శాతం మంది ప్రజలు వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమల పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. సాగులో రైతన్నలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు టెక్నాలజీ పరిష్కారం చూపించగలదన్నారు. ఆ దిశగా రైతన్నలకు మేలు జరిగేలా మరిన్ని నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
విదేశాల్లో మాదిరిగానే మన దగ్గర కూడా మానవ ప్రమేయం లేకుండా అగ్రి రోబోలే వ్యవసాయం చేసే రోజులు త్వరలో వస్తాయని శ్రీధర్ బాబు చెప్పారు. వీటి తయారీకి ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయని వివరించారు. సాగు వ్యయం తగ్గేలా, రైతన్నలకు మేలు చేసే కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలు, వ్యక్తులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంపై జర్మనీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.