-
ఇప్పటి దాకా ప్రకటన చేయని బాబు, పవన్
-
రేపటి భేటీకి ఐదు రాష్ట్రాల సీఎంలు,ఒక డిప్యూటీ సీఎం
-
ప్రతినిధులను పంపిన జగన్, మమత,నవీన్ పట్నాయక్
-
తెలంగాణనుంచి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్
-
కర్ణాటక నుంచి డి.కె. శివకుమార్
-
పెను ఉద్యమానికి ఇది నాంది అన్న స్టాలిన్
-
మద్దతిచ్చిన 58 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు
-
ఎన్డీఏ లో ఉన్నందుకు స్పందించని బాబు,పవన్?
నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలపై ఆందోళన ఎప్పటినుంచో ఉంది. ఎంతో మంది దీనిపై గళమెత్తినా తొలిసారి కార్యరూపంలో తమ వ్యతిరేక స్పందనను తెలియ చేసినది మాత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. రేపు డీలిమిటేషన్ పై అన్యాయానికి బలయ్యే దక్షిణాది రాష్ట్రాలు ఏం చేయాలన్న దానిపై కార్యాచరణ నిర్ణయించేందుకు రేపు స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల జేఏసి సమావేశం చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సమావేశానికి రావాల్సిందిగా అన్ని ప్రాంతీయ పార్టీలకూ స్టాలిన్ లేఖలు రాశారు. పొరుగు రాష్ట్రాలకైతే వ్యక్తిగతంగా మంత్రులు, అధికార్లను పంపి ఆహ్వాన పత్రాలు అందించారు. రేపు జరిగే ఈ సమావేశానికి కేరళ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల తరపునుంచి వారి పార్టీల ప్రతినిధులు పంపిన అధికారులూ హాజరు కానున్నారు.
ఇదొక చారిత్రక దినం ;
భారతీయ ఫెడరల్ సమాఖ్య పరిరక్షణకు ఇదొక చారిత్రక దినమని అభివర్ణించిన స్టాలిన్ రేపు దీనిపై కార్యాచరణ ప్రణాళికను చర్చించబోతున్నారు.పార్లమెంటరీ నియోజక వర్గాల పునర్వివిభజన అనేది పారదర్శకంగా జరగాలని తమిళనాడు కోసం తాము మొదలు పెట్టిన ఉద్యమం జాతీయ స్థాయిలో పెను ఉద్యమంగా మారిందని దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు ఇదొక నిదర్శనంగా నిలిచిందని ఎక్స్ వేదికగా ఎంకె స్టాలిన్ పోస్ట్ చేశారు.మన దేశ పరిరక్షణలో రాష్ట్రాల ఫెడరల్ ఐక్యతకు చిహ్నంగా మొదలైన ఈ ఉద్యమం రేపు యావద్దేశం గుర్తిస్తుందని అన్నారు.
తమిళనాడులో ఈనెల 5న జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరైన పార్టీలన్నీ పారదర్శకమైన నియోజక వర్గాల పునర్విభజన కోరుకుంటున్నాయన్నారు. దాదాపు 58 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి మద్దతు పలికాయి.తమిళనాడు ఎంపీలు, మంత్రులు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇది అతిపెద్ద ఉద్యమంగా రూపు దాల్చుతుందని స్టాలిన్ అంటున్నారు.
ఎవరెవరు వస్తున్నారు?
శనివారం నాటి సమావేశానికి తమిళనాడు, కేరళ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ హాజరవుతున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీలో వైసీపీ అధినేత జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ల తరపున ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
రేవంత్ ఎందుకొస్తున్నారు?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించారు. రేవంత్ ను వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి స్టాలిన్ ఏకంగా మంత్రుల బృందాన్నే పంపారు. రేవంత్ ఢిల్లీలో ఉన్నారని తెలుసుకుని ఆయన దగ్గరకు ఎంపీ కనిమొళి, మంత్రి కె. ఎన్. నెహ్రూ,మాజీ కేంద్ర మంత్రి ఏ. రాజా ఢిల్లీ వెళ్లి వ్యక్తిగతంగా ఆయన్ను కలసి ఆహ్వాన పత్రిక అందించారు. ఆ తర్వాత రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపి స్వార్ధంతోనే డీలిమిటేషన్ కు పూనుకుంటోందని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తాము స్టాలిన్ ఉద్దేశాన్ని సమర్ధిస్తున్నామని అయినా హై కమాండ్ అనుమతి తీసుకుని ప్రొసీడ్ అవుతామని అన్నారు. అన్నట్లుగానే హై కమాండ్ అనుమతితో ఆయన వ్యక్తిగతంగా రేపు హాజరవుతున్నారు.రేపటి సమావేశం బీజేపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల అతిపెద్ద ఐక్య వేదికగా నిలవబోతోంది.
అలా అయితే మనకు నష్టమే..
డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతుండటం తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న అపోహలు బలపడుతున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వచ్చే ప్రమాదముంది. అదే జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల గళం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అదే ఇంత ఉద్యమానికి కారణమైంది.
ఏపీ ఎటువైపు?
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ బీజేపిపై ఒంటి కాలితో ధ్వజమెత్తినవారే.దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతోందంటూ ఆందోళన చేసిన వారే.చంద్రబాబైనా తన రెండు కళ్ల సిద్ధాంతంతో ఈ అంశంపై పైపై ప్రకటనలతో సరిపెట్టారు కానీ పవన్ కల్యాణ్ అయితే మరీ దారుణంగా ప్లేటు ఫిరాయించినట్లే..
సేనాని అడ్డగోలు తీరు..అప్పుడలా… ఇప్పుడిలా..
గతంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ పార్టీ సమావేశాల్లో జనసేనాని గట్టిగా నినదించి గగ్గోలు పెట్టారు. తాను రాజకీయాలతో సంబంధం లేకుండా అందరు నేతలను కలసి అతిపెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతానంటూ హంగామా చేశారు. ఆ తర్వాత కార్య రూపం దాల్చినది మాత్రం శూన్యం. పార్టీ ఓటమితో రాజకీయమనుగడ కోసం విభేదించిన వారితోనే చెలిమి చేసి ఎన్డీ ఏ కూటమిలో చేరడంతో ఆయన స్వరం మార్చేశారు. మొన్నటి జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో సైతం బాహాటంగా ప్లేటు ఫిరాయించారు. సనాతనీ హిందూ గా మారాక ఆయన గళం హిందూత్వాన్ని నినదిస్తోంది. తమిళనాడు వాళ్లు హిందీని వ్యతిరేకిస్తున్నారని, అలాంటప్పుడు తమిళ భాషా చిత్రాలను హిందీలోకి డబ్ చేయడం మానేయండి అంటూ స్టాలిన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. డీలిమిటేషన్ పై బాహాటంగా వైఖరి స్పష్టం చేయనప్పటికీ ఆయన ప్రస్తుతం బీజేపి మంత్రం పఠిస్తున్నారు కాబట్టి రేపటి జేఏసీ భేటీకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. టిడిపి, జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి రేపటి సమావేశానికి వెళ్లే అవకాశాలు లేవు.దాంతో ఏపీ నుంచి అధికారిక ప్రాతినిధ్యం లేనట్లే..