37.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం జరిగిందా? -భాస్కర నిజ నిర్థారణ

ప్రపంచవ్యాప్త పండుగకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదిక అయ్యింది. కోలాహలంగా మహా కుంభమేళా జరుగుతోంది. మొదటి మూడు రోజుల్లోనే కోట్లలోనే మహాసాధువులు, నాగసాధువులు, సాధారణ భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. పన్నెండేళ్ల కోసారి జరిగే ఈ మహా కుంభమేళాకు భారతదేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మహా కుంభమేళా పవిత్ర సమయంలో త్రివేణీ సంగమంలో మునిగి పాపాలు పోగొట్టుకునేందుకు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు తాపత్రయపడుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం మహాకుంభమేళా పరిసరాల్లో కనిపిస్తున్నారు. ఫలితంగా ప్రయాగ్‌రాజ్‌ మొత్తం కిక్కిరిసిపోతోంది.

అయితే, ఓవైపు.. ఈ ఆధ్యాత్మిక సంరంభం ప్రయాగ్‌రాజ్‌ మొత్తం ఆవరించి ఉన్న సమయంలో, దేశం చూపులన్నీ అటువైపే చూస్తున్న తరుణంలో సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిందన్నది ఆ వీడియో సారాంశం. ఒక్కరిద్దరు కాకుండా చాలామంది తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

జరుగుతున్న ప్రచారం :

సోషల్‌ మీడియాలో పలువురు ప్రయాగ్‌రాజ్‌లో అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొంటూ కొన్ని దృశ్యాలు షేర్‌ చేస్తున్నారు. అవి వైరల్‌గా మారుతున్నాయి. వీరిలో ఇద్దరు సోషల్ మీడియా యూజర్లు చేసిన పోస్టులు మాత్రం పరిశీలిద్దాం… వకీల్‌ ప్రధాన్‌ అనే వ్యక్తి ఈనెల 3వ తేదీన తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఈ వీడియోతో కూడిన పోస్ట్‌ షేర్‌ చేశారు.

https://x.com/VakilPradhanMzp/status/1874912596916359440

అలాగే, సైమాఖాన్‌ అనే మరో ట్విట్టర్‌ యూజర్‌ కూడా ఈనెల 13వ తేదీన అదే వీడియోను, అదే కోణంలో తన హ్యాండిల్‌పై పోస్ట్‌ చేశాడు. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లోని ఆస్పత్రిలో మంటలు చెలరేగాయని, అగ్నిమాపక బృందాలు మంటలు ఆర్పేస్తున్నాయని, రెస్క్యూటీమ్‌లు బాధితులను రక్షిస్తున్నాయని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

https://x.com/saimakhan__86/status/1878527427397165492

ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆ వీడియోలను గమనిస్తే.. నిజంగానే మంటలు చెలరేగడం, పొగ దట్టంగా అలుముకోవడం, అగ్నిమాపక బృందాలు, రెస్క్యూటీమ్‌లు ఉరుకులు, పరుగుల మీద సహాయక చర్యలు చేపట్టడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.

భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ :

ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోల నుంచి ఇమేజ్‌లను సేకరించిన భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్‌.. ఆ ఫోటోలను రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ద్వారా పరిశీలించింది. వాటి ఆధారంగా ఇలాంటి కోణంలోనే పోస్టులు పెట్టిన మరిన్ని సోషల్‌ మీడియా అకౌంట్లు కనిపించాయి. వాటితో పాటు.. ఉత్తరప్రదేశ్‌, ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు, తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలు, వాటి రైటప్‌లు కూడా కనిపించాయి.

ఈ వీడియోలకు సంబంధించి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన హ్యాండిళ్లలో పోస్టులు పరిశీలిస్తే వాస్తవమేంటో నిర్ధారణ అయ్యింది. అధికారికంగా నిరూపణ అయ్యింది. మరి..పోలీసుల ట్విట్టర్‌ హ్యాండిల్స్‌లో ఏం రాశారో చూద్దాం..

యూపీ పోలీస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ పేరుతో ఉన్న ట్విట్టర్‌ హ్యాండిల్‌లో జనవరి 12వ తేదీనే ఈ ఫేక్‌ న్యూస్‌పై ఓ క్లారిటీ ఇస్తూ పోస్ట్‌ చేశారు. కొందరు సోషల్‌ మీడియా యూజర్లు పోస్ట్‌ చేసిన వీడియోతో పాటు.. దానికి సంబంధించిన కీ ఫ్రేమ్స్‌ కూడా షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నట్లు ప్రయాగ్‌రాజ్‌లో అగ్నిప్రమాదం జరగలేదని ఆ పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి డిసెంబర్‌ 27వ తేదీన వివిధ విభాగాలతో నిర్వహించిన మాక్‌డ్రిల్‌ వీడియోను ఇలా తప్పుడు ప్రచారంతో వైరల్‌ చేస్తున్నారని స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. ఇలా తప్పుదోవ పట్టించేలా ఈ మాక్‌డ్రిల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నామని కూడా పేర్కొన్నారు.

ఇదే అన్వేషణలో మరో ట్విట్టర్‌ పోస్ట్ కూడా కనిపించింది. ఫైర్‌ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీస్‌ అనే పేరుతో ఉన్న ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఈనెల 13వ తేదీన ఆ మాక్‌డ్రిల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్‌ చేశారు. డిసెంబర్‌ 27వ తేదీన మాక్‌డ్రిల్‌ సమయంలో మీడియాకోసం రూపొందించిన ప్రెస్‌నోట్‌ను కూడా ఆ పోస్ట్‌లో షేర్‌ చేశారు.అయితే, అదేరోజు ఒక్కప్రాంతంలో మాత్రమే కాదని, మహా కుంభమేళా, ప్రయాగ్‌రాజ్, సెంట్రల్ మెడికల్ పెరేడ్, సంగం నోస్, నాగవాసుకి ప్రాంతం, ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌తో సహా పలు కీలక ప్రదేశాలలో కూడా మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు పోలీసులు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సమర్థవంతంగా నిర్వహించేందుకు సంసిద్ధతను పెంపొందించడం, మహా కుంభమేళా 2025 సందర్భంగా లక్షలాది మంది భక్తుల భద్రతను నిర్ధారించడటమే ఈ మాక్ డ్రిల్ లక్ష్యమని అందులో వివరించారు.

అన్వేషణలో భాగంగా మరో అధికారిక స్పందన కూడా కనిపించింది. కుంభమేళా పోలీస్‌ యూపీ 2025 అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌లో మరో పోస్ట్‌ చేశారు. ఈనెల 13వ తేదీన చేసిన ఆ పోస్ట్‌లో.. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో అగ్నిప్రమాదం జరిగిందంటూ సోషల్‌ మీడియాలో ఫేక్‌న్యూస్ ప్రచారం చేసిన పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.


కుంభమేళా పోలీసులు ముందస్తుగా నిర్వహించిన ఫైర్ మాక్ డ్రిల్‌కు సంబంధించిన వీడియోను ఇలా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని ప్రయాగ్‌రాజ్‌ డీఐజీ వైభవ్ కృష్ణ కూడా మరో పోస్ట్‌ చేశారు. నిరాధారమైన సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్‌ మీడియా యూజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ట్విట్టర్‌ చేసిన ఆ పోస్టులో హెచ్చరించారు.

ఈనెల 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాధు జన సమీకరణ జరిగే ఉత్సవం అయిన ఈ కుంభమేళా దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకుంది. ప్రతి పుష్కరానికి ఒకసారి అంటే.. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాలో గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం అయిన ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగుతుంది. అయితే, లెక్కకుమించి.. అనంతంగా తరలివచ్చే సాధుసంతువులకు, భక్తులకు, యాత్రికులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, సదుపాయాలు కల్పించడం ప్రహసనంగా మారుతుంది. అయితే, భారీగా తరలివచ్చేవాళ్లకోసం రద్దీని నియంత్రించేందుకు, సజావుగా పవిత్రస్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది. అవసరమైన మౌళిక సదుపాయాలు, భద్రత, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలపైనా దృష్టిపెట్టింది.

ఇందులో భాగంగానే ఏర్పాట్లను సమీక్షించుకోవడం, అప్రమత్తంగా ఉండటం, జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎలా వ్యవహరించాలన్న అంశాలపై అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే మాక్‌డ్రిల్‌ చేపట్టారు. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా మొదలయ్యాక అనుకోని సంఘటన ఎదురైతే ఎలా ఎదర్కోవాలన్న దానిపై కసర్తతు చేశారు. ఇందులో భాగంగానే.. అలారం బెల్ మోగించడం, అగ్నిమాపక సామాగ్రితో పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తులు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించడం, గాయపడ్డవాళ్లను ఎలా తీసుకెళ్లాలో నిర్వహించే దృశ్యాలు వంటివి.. మాక్‌డ్రిల్‌ చేపట్టిన సమయంలో ఫోటోలతో పాటు.. వీడియోలు కూడా రికార్డ్‌ చేశారు. అయితే, ఆ వీడియోలనే కొందరు నిజమైన ప్రమాదంగా అభివర్ణిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మహా కుంభమేళా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు, చేస్తూనే ఉన్నారు.

============================================================
వైరల్‌ అవుతున్నదేంటి?

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, రెస్క్యూటీమ్స్‌ ఉరుకులు పరుగులతో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

వాస్తవం ఏంటి?
అగ్నిప్రమాదం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న వాళ్లు షేర్‌ చేస్తున్న వీడియో మాక్‌డ్రిల్‌కు సంబంధించినది. డిసెంబర్‌ 27వ తేదీన ముందుజాగ్రత్త చర్యగా ప్రయాగ్‌రాజ్‌లోని ప్రధాన ప్రాంతాల్లో మాక్‌డ్రిల్‌ చేపట్టారు.

భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ :
సోషల్‌ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం. భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్‌ పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడయ్యింది.

============================================================

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com