భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. బుధవారం ఈ పిటిషన్ ధర్మాసనం ముందుకు రాగా.. ఎమ్మెల్యే కూనంనేని దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో పాటు.. కేసులో వాదనలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
కూనంనేని సాంబశివరావు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు పేర్కొనకుండా దాచారంటూ ఆయనపై పిటిషన్ దాఖలయ్యింది. అయితే, తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఇప్పటికే కూనంనేని.. హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. అక్కడ కూడా కూనంనేనికి షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్‌కు సంబంధించి ఆయనపై దాఖలైన పిటిషన్ విషయంలో వాదనలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కూడా ఎమ్మెల్యే కూనంనేనికి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూనంనేని.. నిబంధనలను ఉల్లంఘించారని, ఫారం 26 ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించలేదంటూ కొత్తగూడెంకు చెందిన నందూలాల్ అగర్వాల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కూనంనేని ఎన్నికను సవాల్ చేస్తూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిట్నరింగ్ అధికారికి సమర్పించిన ఫారం 26 అఫిడవిట్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన కూనంనేని సాంబశివరావు.. తన భార్య పేరు పేర్కొనలేదన్నారు. అలాగే లైసెన్స్‌డ్ నోటరీతో అఫిడవిట్ రూపొందించలేదంటూ తన పిటిషన్‌లో నందూలాల్ అగర్వాల్ స్పష్టం చేశారు.
అయితే నందూలాల్ వేసిన పిటిషన్‌ను కొట్టేయాలంటూ మొదట కూనంనేని సాంబశివరావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, నందులాల్ పిటిషన్‌ను క్వాష్ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఎమ్మెల్యే కూనంనేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా సుప్రీంకోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించింది.