28 C
Hyderabad
Friday, July 31, 2026

Live Video

spot_img

విశాఖ రైల్వే జోన్‌ ఉత్త డొల్ల

  • రూపు రేఖలు ఏర్పడకుండానే బక్కచిక్కిన సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌
  • రెండు ముక్కలైన వాల్తేర్‌ డివిజన్‌
  • రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌ ఏర్పాటు… ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కి కేటాయింపు
  • అరకు, కేకే లైన్లు రాయగడ డివిజన్‌కు

విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ కావాలనేది ఉత్తరాంధ్ర వాసుల దశాబ్ధాల కల. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర వాసులే కాక యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్ష. రాష్ట్ర విభజన జరగక ముందు అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏవీ ఆంధ్రుల ఈ డిమాండ్‌ని పట్టించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో మాత్రం విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ఆంధ్రులకు ఇస్తున్న ఒక వరంలా పొందుపరచారు. అయితే విభజన జరిగి దశాబ్ధం కావస్తోంది కానీ రైల్వే జోన్‌ ఏర్పాటు మాత్రం కాలేదు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పేరుతో  విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది ఫిబ్రవరి 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌ కేటయించి అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్ధలంలో ప్రధాని శంఖుస్ధాపన కూడా చేశారు కానీ జోన్‌ స్వరూప స్వభావాలు, పరిధిలను మాత్రం ప్రకటించ లేదు. తాజా బుధవారం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం కేంద్ర రైల్వే జోన్‌ విడుదల చేసిన ఉత్తర్వులు చూసి అందరూ షాక్‌కి గురయ్యారు. విశాఖ రైల్వే జోన్‌ పరిధి నిర్ణయంలో ఒడిషా ప్రయోజనాలను కాపాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధిక రెవెన్యూ ఉండే అరకు, కేకే లైన్‌ ను మినహాయించి విశాఖపట్నం రైల్వే జోన్‌ని ప్రకటించారని ఆంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్తేర్‌ డివిజన్‌ విభజించి విశాఖపట్నం, రాయగడ డివిజన్లగా ఏర్పాటు చెయ్యడాన్ని కూడా ఉత్తరాంధ్ర వాసులు తప్పుపడుతున్నారు. ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం అరకులోయతో సహా కేకేలైన్లను ఒడిషా రాష్ట్రంలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్‌ లో చేరుస్తూ కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం వాల్తేర్‌ డివిజన్‌ లో ఉండే ఈ ప్రాంతాలు ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాయగడ రైల్వే డివిజన్‌లోకి వెళ్లిపోతాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే నూతన రాయగడ రైల్వే డివిజన్‌… భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ పరిధిలో ఉండేలా ఖరారు చేశారు. ఈనిర్ణయంతో విశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌కు భారీగా ఆదాయం గండిపడనుంది. తగ సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వుల్లో వాల్తేర్‌ రైల్వే జోన్‌ని కొనసాగించారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రకటించిన జోన్‌ పరిధి, స్వరూప స్వభావాల్లో వాల్తేర్‌ డివిజన్‌ను రెండుగా చీల్చి రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌ ఏర్పాటు చేసి దాన్ని ఈస్ట్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌లో కలుపుతున్నట్లుగా కేంద్ర రైల్వే బోర్డు ప్రకటన చేసింది. కేకే లైన్‌ కోల్పోవడం వల్ల విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్‌ ఆర్థికంగా స్ధిరపడే అవకాశం లేదని రైల్వేలో పని చేస్తున్న సీనియర్‌ ఉద్యోగులు కూడా వాపోతున్నారు. దీని వల్ల రానున్న కాలంలో విశాఖ రైల్వే జోన్‌ నాన్‌ పెరఫర్మె్న్స్‌ జోన్‌గా మిగిలిపోతుందనే ఆందోళణ వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నా… ఒడిషా ఒత్తిళ్లకు లొంగి విశాఖ రైల్వే జోన్‌కు తీరని అన్యాయం చేశారని ఉత్తరాంధ్ర వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇంత మంది ఎంపీలు ఉండి కూడా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ విశాఖ డివిజన్‌ పరిధిలో ఉన్న 250 కిలో మీటర్ల రైల్వే లైనును కొల్పోయి కేవలం 46 కిమీ రైల్వే లైనును తెచ్చుకుంటున్నాం. అలాగే కార్గో, టూరిజం రంగాలకు చెందిన సెక్షన్లను కూడా కొల్పోతున్నాం. అరకు, కేకేలైన్‌లు కోల్పోవడం వల్ల సాలీనా సుమారు రూ. 10 వేల కోట్ల రూపాలయ ఆదాయాన్ని కోల్పోయినట్లు అవుతుందనే వాదన తెరపైకి వస్తోంది. ఇంకా రూపు రేఖలు ఏర్పడకుండానే బక్కచిక్కిన సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ మున్ముందు ఏ విధంగా ఆదాయం సమకూర్చుకుని ఒక విజయవంతమైన జోన్‌ గా పేరు తెచ్చుకుంటుందా… లేక నష్టాల్లో ఉన్న రైల్వే జోన్‌ గా పేరు తెచ్చుకుంటుందో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం డివిజన్ల విభజన, జోన్ల కేటాయింపులన్నీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అరకు, కేకే లైన్లను విశాఖ రైల్వే జోన్‌లోనే కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆంధ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com