- మమతా కులకర్ణిని చేర్చుకోడం పై చిచ్చు
- కిన్నర్ అఖాడాలో రాజుకున్న అసమ్మతి సెగ
- ఒకరి నొకరు బహిష్కరించుకున్న ఇద్దరు సాధువులు
- మమతకు మహామండలేశ్వర్ హోదాపై వ్యతిరేకత
- ట్రాన్స్ జెండర్ల కోసం ఏం చేశారని సాధువు నిలదీత?
- కిన్నార్ అఖాడా జునా అఖాడాలో విలీనం
ఆధ్యాత్మిక క్రమశిక్షణను పెంపొందించి, హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పడిన అఖాడాలలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఒకప్పటి బాలీవుడ్‌నటి మమతా కులకర్ణికి అఖాడాలో మహా మండలేశ్వర్ స్థాయిని కల్పించడం వివాదాలకు దారి తీసింది.ఆమె ఆ పదవికి అనర్హురాలని ఆగ్రహించిన కిన్నార్ అఖాడా పెద్దలు తమలో తాము తగువులాడుకుని చివరకు అఖాడానే రెండు గా చీల్చేశారు.
కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడుగా చెప్పుకుంటున్న అజయ్ దాస్ మమతా కులకర్ఱికి మహా మండలేశ్వర్ హోదాను కట్టబెట్టడంపై మండి పడ్డారు.ఆ హోదాను కల్పించిన మరో మహామండలేశ్వర్ ఆచార్య లక్ష్మి నారాయణ్ త్రిపాఠీని, మమతా కులకర్ఱిని కూడా తమ అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు అజయ్ దాస్ ప్రకటించారు.ఎవరు పడితే వారు వచ్చి పదవులు, హోదాలు పొందేందుకు మహాకుంభమేళా బిగ్ బాస్ షో కాదని ఆయన విమర్శించారు.గత మూడేళ్లుగా వారు అఖాడాకు చేసినదేమీ లేదని అన్నారు.
కులకర్ణి కుంపటి…
మమతా కులకర్ణి 52 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. ఈ ఏడాది మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశాక ఆమెకు జనవరి 24న మహామండలేశ్వర్ హోదాను కల్పించారు త్రిపాఠీ.అయితే రిషీ అజయ్ దాస్ విమర్శలతో అఖాడాలో గొడవలు రేగాయి. దాంతో లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. హిందూ మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని పైకి తీసుకు రావడానికి ప్రయత్నించాల్సిన త్రిపాఠీ అసలు ఆ బాధ్యతలే పట్టించుకోవడం లేదని కిన్నార్ అఖాడా ఫౌండర్ అజయ్ రిషి దాస్ ప్రకటించారు.మమతా కులకర్ణి లాంటి వ్యక్తికి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన చరిత్ర ఉందని అలాంటి వ్యక్తి సన్యాసం తీసుకోకుండానే మహామండలేశ్వర్ స్థాయికి ఎలా నియమిస్తారని రిషి దాస్ అన్నారు. అయితే ఈ ఆరోపణలను త్రిపాఠీ తిప్పి కొట్టారు. మమతాకులకర్ణి సన్యాసం స్వీకరించారని, ఆమెపై కేసులన్నీ తప్పుడు కేసులని తేలిపోయిందని అన్నారు.తన లీగల్ టీమ్ అజయ్ దాస్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అజయ్ దాస్ ని 2017లొనే కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరించామని, ఉజ్జయినీ కుంభమేళా సమయంలో కిన్నార్ అఖాడా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయని, 2019లో కిన్నార్ అఖాడా ప్రయాగ్ రాజ్ కుంభమేళా అప్పుడు జునా అఖాడాలో విలీనమైపోయిందని ఆమె అన్నారు.