– సభలో ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు
– రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు అన్నమాట నిలబెట్టుకున్నారు. ఆ ప్రకారం విశాఖ చుట్టుపక్కల సుమారు రూ.2 లక్షల కోట్లతో అభివ్రద్ధి పనులకు ప్రధాని మోదీతో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయించారు. ఈ నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
ప్రపంచం మెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ప్రధాని మోదీ మాత్రమేనని అన్నారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా తనకి అభిమానులు ఉండటం విశేషమని అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన రోడ్ షొ అదిరిపోయిందని తెలిపారు.
విశాఖలో ప్రజలను చూస్తుంటే, ఎనలేని ఉత్సాహం వస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తానని ఇక్కడ ప్రజలకు మాటిచ్చాను, నేడు, ఆ మాట నిలబెట్టుకున్నానని తెలిపారు. ఇవన్నీ అతి త్వరలోనే పూర్తవుతాయి. అవి కాగానే విశాఖ వాణిజ్య నగరంగా ముంబయికి ధీటుగా మారుతుందని తెలిపారు.
ఇక ప్రధాని మోదీని ప్రశంసిస్తూ…ఆయనపై ప్రజలు అచంచల విశ్వాసాన్ని చూపిస్తున్నారని కొనియాడారు. భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టిన నేత ప్రధాని మోదీ అని తెలిపారు. ఏపీలో ఎన్టీయే కూటమి 93 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ కాంబినేషన్ కొనసాగుతుందని తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని అన్నారు. ప్రధాని మోదీ పాలనలో సక్సెస్ మంత్ర ఏమిటంటే, సంక్షేమం, అభివ్రద్ధి, సంస్కరణలు, సుపరిపాలన అని తెలిపారు. ఇవన్నీ ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని అన్నారు.
అలాగే ప్రధాని మోదీ నినాదాలు కూడా కొన్ని ఉన్నాయని అన్నారు. అవేమిటంటే దేశాన్ని బలమైన ఆర్థికశక్తిగా మార్చేందుకు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇలా ఎన్నో ఉత్తేజకరమైన నినాదాలతో యువతకు దారి చూపించారు, మేలుకొలిపారని అన్నారు.
ఇలాంటివారితో కలిసి ఆంధ్రదేశాన్ని అద్భుత రాష్ట్రంగా మార్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య తెలిపారు