36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ట్రంప్ మాటలకు అర్థాలే వేరులే…

ఉన్నది ఉన్నట్టు.. మొఖం మీదే కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముందు నుంచి ఉన్న అలవాటు. కానీ ఈ మధ్య ఆయన మాటలకు అర్థాలు మారుతున్నట్టు కనిపిస్తోంది. బాధ్యతలు తీసుకున్నది మొదలు సంచలనాలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ భయానక వాతావరణం సృష్టిస్తున్న ట్రంప్ ఈ మధ్య వివాదస్పద వ్యాఖ్యల డోస్ పెంచారు. దీంతో ఇప్పుడు వైట్ హౌజ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ మాటలకు అర్థం అది కాదంటూ మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది.

ట్రంప్‌ ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటామన్నారు ట్రంప్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో జరిగిన చర్చల తర్వాత అదే ఊపులో వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారో లేక కావాలనే చెశారో తెలీదు కానీ.. గాజాను స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పనిలో పనిగా పాలస్తీనా ప్రజలకు ఈజిప్ట్, జోర్డాన్‌లు ఆశ్రయం ఇస్తాయనన్నారు. ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఓ పెద్ద చర్చకే దారి తీసింది.

ట్రంప్‌ చేసిన ఈ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా కాస్త వ్యతిరేకత వచ్చిందనే చెప్పాలి. గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవడమేంటి? ఆ అవసరం అమెరికాకు ఏముంది? అనేది అసలు ప్రశ్న. దీంతో వైట్‌హౌజ్‌ తప్పు తెలుసుకుందో.. లేక తత్వం బోధపడిందో కానీ కొత్త ప్రకటనను రిలీజ్ చేసింది. అసలు ట్రంప్‌ మాట్లాడిన దానికి అర్థం అది కాదు.. స్వాదీనం చేసుకోవడం అంటే పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కాదు.. తాత్కాలికంగా వారిని ఇతర ప్రాంతాలకు తరలించి.. వారి ఇళ్లను పునర్ నిర్మిస్తామని.. అంతే తప్ప మరోకటి కాదన్నారు. అంతేకాదు డెవలప్‌ చేస్తామంటే అమెరికా డబ్బును అక్కడ ఖర్చు చేస్తామని కాదు.. అమెరికా భాగస్వాములతో డీల్ చేసుకుంటామని ప్రకటించారు.

ఓవైపు ఇలా డ్యామేజ్‌ కంట్రోల్ జరుగుతుండగానే ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి మరో ప్రకటన బయటికి వచ్చింది. అదే పనామా కాలువ విషయంలో అమెరికా తన పంతం నెగ్గించుకుందని. తీరా చూస్తే అది కూడా ఉత్తి కథే అని తేలిపోయింది. పనామా కాలువ గుండా ప్రయాణించే తమ షిప్‌లకు ఇక నుంచి ఎలాంటి ఛార్జీలు ఉండవని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అమెరికా రక్షణ మంత్రి హెగ్సే.. పనామాకు చెందిన మంత్రితో చర్చించిన తర్వాత ఈ స్టేట్‌మెంట్ బయటికి వచ్చింది. హెగ్సే కూడా పనామా దీనికి అంగీకరిస్తుందన్నారు. దీంతో పనామా దారికొచ్చిందంటూ అమెరికాలో కథనాలు మొదలయ్యాయి. కానీ తీరా అసలు విషయానికి వస్తే.. అలాంటిదేం లేదని కొట్టిపారేశాయి పనామా వర్గాలు. అసలు తాము అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని అధికారికంగా స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది పనామా. దీంతో అమెరికా పరువు ఆ పనామా కాలువలోనే కలిసిపోయిందనే చెప్పాలి.

ఇలా తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియదు కానీ ఆవేశంలో ఓ మాట అనడం.. ఆ తర్వాత నాలిక్కరుచుకోవడం ఇప్పుడు ట్రంప్‌కు అతని అధికార వర్గానికి కామన్‌గా మారింది. సెన్సెషన్‌కు కేరాఫ్‌గా నిలవాలని చూస్తూ ఉన్న పరువు పొగొట్టుకుంటున్నారు ట్రంప్, అతని అధికారవర్గం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com