ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. అమెరికా నుంచి వందల బిలియన్ల డాలర్లు సాయం అందుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదని మండిపడ్డారు. చిన్న పిల్లల నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్ము తీసుకొన్నారని జెలెన్‌స్కీని విమర్శించారు.
‘చిన్నారి నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా బైడెన్ సర్కారు నుంచి జెలెన్‌స్కీ సొమ్ములు తీసుకున్నారు. అతడికి (జెలెన్‌స్కీ) 350 బిలియన్లు ఇచ్చాము. యూఎస్ నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్నా జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదు’ అని ఆరోపించారు.
ఉక్రెయిన్‌పై విమర్శలు చేసిన ట్రంప్ మరో కామెంట్ చేశారు. రష్యా విషయంలో అత్యంత కఠినంగా ఉన్న అధ్యక్షుడిని తానే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా విషయంలో తనకంటే కఠినంగా ఎవరూ లేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు కామెడీకి ఎక్కువ సీరియస్‌కు తక్కువ అన్నట్టు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచమంతా ట్రంప్, పుతిన్ స్నేహితులు అంటుంటే కఠినంగా ఉన్నా అనే వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా స్వార్థ ప్రయోజనాల కోసం యుద్దం ఎగదోసి…ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఉక్రెయిన్ దేశాన్ని దోషిగా చేసే యత్నం దుర్మార్గమని విశ్లేషణలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ సహజ వనరులు దోచుకునే ఒప్పందం వాయిదా పడటంతో ట్రంప్ ఈ విధంగా అక్కసు వెళ్లగక్కుతున్నాడని విమర్శలు వస్తున్నాయి.