అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలు విధించుకుంటున్నారు. ఫలితంగా ఈ రెండు దేశాలు గ్లోబల్ మార్కెట్‌కి షాకులు ఇస్తున్నాయి.
తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై భారీగా సుంకాలు పెంచారు. ఇప్పటికే 145 శాతం వరకు ఉన్న సుంకాలపై మరో 100 శాతం పెంచి మొత్తం 245 శాతానికి తీసుకెళ్లారు. ఇది చైనా ఉత్పత్తులపై అమెరికా తీసుకున్న అతి పెద్ద ప్రతీకార చర్యగా భావిస్తున్నారు.
ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించిన వెంటనే ట్రంప్ ఈ నిర్ణయం ప్రకటించారు. చైనా ప్రపంచంలో 90 శాతం రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తి చేస్తోంది. ఇవి అమెరికా, ఇతర దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, కార్లు, విమానాలు, సెమీ కండక్టర్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి.
సమారియం, గడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, ఇట్రియం వంటి ఏడు ఖనిజాలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చైనా చేర్చింది. ఈ ఖనిజాల సరఫరా ఆగిపోతే, అమెరికా రక్షణ రంగానికి పెద్ద దెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక చైనా నిర్ణయానికి ప్రతిగా ట్రంప్ భారీ ప్రతీకార సుంకం విధించడంతో, వాణిజ్య రంగంలో గందరగోళం మొదలైంది. చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం వరకు సుంకాలు పెంచింది.
ఇవన్నీ జరుగుతున్న తరుణంలో, ట్రంప్ కొన్ని కీలక వస్తువులపై పన్నులు తగ్గించారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, సెమీకండక్టర్లు వంటి హైటెక్ ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ విడుదల చేసింది.
ఈ పరిణామాలన్నీ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా తయారీదారులు ప్రత్యామ్నాయ సరఫరాదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, రాబోయే రోజుల్లో వాణిజ్య యుద్ధం ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాలి.