తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటన చేపట్టింది. ఇవాల్టి నుంచి ఈనెల 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొంటున్నారు.
ఈ పర్యటనలో టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమా నగరాలను సందర్శించి, పరిశ్రమల అభివృద్ధికి అనువైన అవకాశాలపై చర్చలు జరపనుంది రేవంత్ టీమ్. ఇందులో భాగంగా జపాన్‌లోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల నేతలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు.
రేపు.. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), సోనీ గ్రూప్, జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JETRO), బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వంటి సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ బృందం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు.
ఏప్రిల్ 18న టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్‌తో సమావేశమవుతారు. అలాగే, అక్కడి పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. టొయోటా, ఐసిన్, ఎన్టీటీ, జపాన్ ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వంటి ప్రముఖ కంపెనీలతో వేర్వేరుగా మీటింగ్‌లు జరుగుతాయి.
జపాన్ పర్యటనలో భాగంగా సుమిదా రివర్ ఫ్రంట్, మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్, కిటాక్యూషు సిటీ ఎకో టౌన్ ప్రాజెక్టులు కూడా రేవంత్ బృందం పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో వాతావరణ అనుకూల పరిశ్రమల అభివృద్ధిపై చర్చలు జరిపే అవకాశం ఉంది. మురసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్‌ను కూడా తెలంగాణ టీమ్ సందర్శిస్తుంది.
ఏప్రిల్ 21వ తేదీన సీఎం రేవంత్ బృందం ఒసాకా చేరుకుని ‘ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో – 2025’లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. అదే రోజు బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఒసాకా రివర్‌ఫ్రంట్‌ను సందర్శించి అభివృద్ధి ప్రణాళికలపై అవగాహన పొందనున్నారు.
పర్యటన చివరిరోజు.. ఏప్రిల్ 22న హిరోషిమాలో పీస్ మెమోరియల్ సందర్శిస్తారు. గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌లతో భేటీ అవుతారు. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీ, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సందర్శన కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి.
తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి జపాన్‌తో భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవడం, పెట్టుబడులను ఆకర్షించడం ముఖ్య లక్ష్యంగా ఈ పర్యటన చేస్తున్నారు.