- ట్రంప్ నిర్ణయాలతో శాస్త్రవేత్తల బెంబేలు
- అనేక రిసెర్చ్ సెంటర్లకు నిధులు రద్దు
- అనేక యూనివర్సిటీల్లో రిసెర్చర్లకు శ్రీముఖాలు
- మధ్యలోనే ఆగిపోయిన కీలక పరిశోధనలు
- ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలపై ట్రంప్ గుర్రు
- ఆ వర్సిటీలు, రిసెర్చర్లపై కక్షపూరిత ధోరణి
- ఈ తీరును వాడుకుంటున్న ఈయూ దేశాలు
- యూఎస్ రిసెర్చర్లకు ఫ్రాన్స్, జర్మనీ, యూరప్ పెద్దపీట
- ట్రంప్ బ్రెయిన్ డ్రెయిన్ థియరీతో యూఎస్ కే నష్టం
అమెరికా ఆర్దిక బడ్డెట్ కుదించేందుకు ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి పరిశోధనలపై పడ్డారు.బిలియనీర్ ఎలన్ మస్క్ సారధ్యంలోని ప్రభుత్వపాలన అడ్వకెసీ టీమ్ సూచనల మేరకు పరిశోధనలకు ఫండింగ్ నిలిపివేశారు.దీంతో పరిశోధకులు, ట్రైనీ రిసెర్చర్లు, ఇతర పరిశోధనా సంస్థలు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. హటాత్తుగా ఇలా ప్రకటించడంతో వారు ప్రత్యామ్నాయంలేక ఏం చేయాలో తెలీక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.ట్రంప్ అధికారం చేపట్టాక తమ రిసెర్చ్ సంస్థకు ఫండింగ్ నిలిపివేశారంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ కూడా పరిశోధనలకు నిధులు నిలిపివేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేసింది. నిధులు ఆపేయడం వల్ల వ్యాక్సిన్ లకు రియాక్షన్ ఎందుకు వస్తుందన్న అంశంపై చేస్తున్న 33 రకాల పరిశోధనలు మధ్యలోనే ఆగిపోయాయి.పైగా సైంటిఫిక్ పరిశోధనలకు విడుదల చేసే నిధుల్లో సింహ భాగం రిసెర్చర్లకు వెళుతుంది కాబట్టి, ట్రంప్ నిర్ణయం తో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.
జాన్ హోప్ కిన్స్ వర్సిటీకి నిధుల రద్దు
పరిశోధనలకు పేరెన్నికగన్న జాన్ హోప్ కిన్స్ యూనివర్సిటీకి అందాల్సిన 800 మిలియన్ అమెరికన్ డాలర్లను నిలిపివేయడంతో దాదాపు రెండు వేల మంది శాస్త్రవేత్తలు ఉద్యోగాలు కోల్పోయారు.
ఫండింగ్ నిలిపి వేయడానికి అనుసరించిన విధానం, పంపిన ప్రభుత్వ లేఖలు కూడా చాలా నిరాశాజనకంగా ఉన్నాయని మెజారిటీ రిసెర్చర్లు బాధపడుతున్నారు. రిసెర్చ్ సంస్తలో పనిచేసే వారికి నేరుగా అందిన లేఖల్లో ఫెడరల్ ఎజెన్సీల ప్రాధాన్యతల జాబితాలో ఆ సంస్థలు లేవని అర్ధం వచ్చేలా క్లుప్తంగా, వివరణ లేకుండా లేఖలు ఉన్నాయి. ఈ లేఖలు దీర్ఘకాలిక పరిశోధనల్లో ఉన్న శాస్త్రవేత్తల మనసు ను నొప్పించాయి. ఏళ్ల తరబడి మంచి సంబంధాలున్న బంధువులు ఒక్క రాత్రిలో బంధాన్ని తుంచేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోందని వారు వాపోతున్నారు. తాము చేస్తున్న ప్రాజెక్టుల భవిష్యత్తుగానీ, అసలు రిసెర్చ్ విధానాలపై సూచనలు కానీ లేవు సరికదా, కట్టే . కొట్టే.. తెచ్చే..అన్న ధోరణిలో ఆదేశాలు ఉన్నాయి. రిసెర్చ్ ప్రాజెక్టు గానీ, భవిష్యత్తులో తీరు మార్చుకున్నా ఫెడరల్ ఏజెన్సీలకు సంబంధం లేదనీ ఆ లేఖల్లో ఉంది.పోనీ నిధులు ఆగిపోయిన రిసెర్చర్ లు, ఫండింగ్ ఏజేన్సీలు కొత్తగా మరోసారి అప్లయ్ చేసుకునే వీలు కానీ, ప్రత్యామ్నాయ విధానాలు గానీ లేకుండా మీ సేవలు ఇక చాలు అన్న రీతిలో బ్లంట్ గా ఉండటం పట్ల పరిశోధకులు నీరు గారిపోతున్నారు.
ఇజ్రాయెల్ ను వ్యతిరేకించినందుకు..
కొలంబియా యూనివర్సిటీకి దాదాపు 400 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను రద్దు చేస్తూ ట్రంప్ తాఖీదులు పంపారు. ఆ యూనివర్సిటీలో చదువుతున్న అనేక మంది స్టూడెంట్లు, గాజాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ ఉద్యమాలు, ఆందోళనలు చేశారు.దీనికి ప్రతిగానే ట్రంప్ రియాక్టయినట్లు అనలిస్టులు చెబుతున్నారు అయితే అధ్యక్షుని హటాత్ నిర్ణయంతో పరిశోధనలు చేస్తున్న రిసెర్చర్లు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.ప్రత్యేకించి ప్రాణాంతక మహమ్మారి కేన్సర్ కు నిరోధక మందును, కోవిడ్ పాండమిక్ చిన్న పిల్లలపై చూపిన ప్రభావంపై చేస్తున్న అధ్యయనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. యూనివర్సిటీ ల్యాబ్ లోనూ,మెడికల్ సెంటర్ లోనూ కీలక పరిశోథనలు మధ్యలోనే నిలిచిపోవడంతో యూనివర్సటీ యాజమాన్యం ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తమ పాలసీని మార్చుకుని శిరస్సు వంచేసింది. విద్యార్దుల క్రమశిక్షణ విధానాలను పునః పరిశీలిస్తామని,వర్సిటీలో మాస్కులు ధరించడాన్ని నిషేధిస్తామని, వర్సిటీ ప్రాంగణాల్లో నిరసనలను అనుమతించబోమని,వివక్ష పూరక విధానాలను తొలగిస్తామని, మధ్యప్రాచ్య దేశాల అధ్యయన విధానాన్నిఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ పరిధిలోకి తెస్తామని, అవసరమైతే సిలబస్ ను కూడా మార్చేస్తామని యూనివర్సిటీ యాజమాన్యం హామీ ఇచ్చింది.అయితే ట్రంప్ కు తలొగ్గి మొత్తం విధానాలనే సమూలంగా మార్చేయడంపై కొందరు ఫాకల్టీ తీవ్రంగా మండిపడుతున్నారు.ఇది అకడమిక్ స్వేచ్ఛను హరించడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తప్పదు మరి..
మరికొందరు యూనివర్సిటీలో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు కొనసాగాలన్నా, వేలాది మంది రిసెర్చర్లు తమ పనులు ముగించుకోవాలన్నా ఇలా చేయక తప్పడం లేదని వర్సిటీలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అడ్మినిస్ట్రేటర్లు అంటున్నారు.అరిజోనా, ఒక్లహామా, డకోటా లాంటి ఏరియాల్లో గ్రామీణ జలవనరుల తీరుపై అధ్యయనం చేస్తున్న మరో శాస్త్రవేత్త ట్రంప్ ఆదేశాలు, వర్సిటీ సర్దుబాటు వైఖరిపట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇది యూనివర్సిటీ ఐక్యతను దెబ్బ తీస్తుందని, బయటి శక్తుల జోక్యానికి దారి తీస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ దెబ్బకు చెవిటి, మూగ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉద్దేశించిన గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు టీచర్లుగా మారకుండానే మధ్యలోనే ఆగిపోయినట్లయింది.ఈ ప్రొగ్రామ్ ద్వారా విడుదలైన ఫండ్స్ ఈ స్టూడెంట్లకు ఫీజులు, వసతి ఖర్చులకు వినియోగించుకుని వారు ప్రొఫెషనల్స్ గా ఎదిగేందుకు ఉపయోగపడేవి.కానీ అవన్నీ రద్దయిపోయాయి. దీంతో మూగ, చెవిటి పిల్లలకు దారి, దిక్కు లేకుండా పోయింది.
కోవిడ్ అధ్యయనాలపై దెబ్బ…
అలాగే డిమిత్రు అనే మరో రిసెర్చ్ సెంటర్ లో కోవిడ్ సోకిన గర్భిణీలకు పుట్టిన పిల్లల భవిష్యత్తు,వారి ఆరోగ్యంపైనా చేస్తున్న అధ్యయనాలు కూడా నిలిచిపోయాయి. ఇదే అధ్యయనంలో తన కొడుకుతో సహా పాల్గొంటున్న ఓ మహిళ ట్రంప్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.అయితే ట్రంప్ నిర్ణయంవల్ల తమ అధ్యయనాలు కొంతమేరకు ఎఫెక్ట్ అయినా, తమకు ఫండింగ్ చేసే ఇతర ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయని వాటి ద్వారా అడుగు ముందుకేస్తామనీ అంటున్నారామె.
మరోవైపు ట్రంప్ నిర్ణయం పట్ల సైంటిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా,యూరోపియన్ యూనియన్ ముందుకొచ్చి సైంటిస్టులను తమ దేశాలకి సాదరంగా ఆహ్వానిస్తోంది.రిసెర్చర్లు, సైంటిస్టులకు తమ వర్సిటీకి రమ్మని అనేక యూరోపియన్ వర్సిటీలు ఆహ్వాన పత్రాలు పంపుతున్నాయి. ఇక్కడ ఉద్యోగాలు కోల్పోయిన సైంటిస్టులను తమ వర్సిటీలో అత్యధిక జీత భత్యాలకు చేర్చుకుని రిసెర్చ్ ఫండ్స్ కేటాయిస్తున్నాయి. ఫ్రాన్స్ లోని అనేక యూనివర్సిటీలు అమెరికన్ సైంటిస్టులు, రిసెర్చర్లకు స్వాగతం పలుకుతున్నాయి.
ప్రధానంగా ప్రభావితమైన అధ్యయనాలివే…
ట్రంప్ నిర్ణయాలతో ప్రధానంగా దెబ్బతిన్నఅధ్యయనాలు ఏమేమంటే క్లైమేట్ ఛేంజ్, పబ్లిక్ హెల్త్,ఎన్విరాన్మెంటల్ సైన్స్, జెండర్ అండ్ డైవర్సిటీ రంగాలు. గతంలో అధ్యయనాలు, రిసెర్చ్ అంటే అందరూ అమెరికాకే పరుగులు పెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న బ్రెయిన్ డ్రెయిన్ విధానాల పర్యవసానాలను యూరోపియన్ దేశాలు బాగా ఎన్ క్యాష్ చేసుకుంటున్నాయి. రిసెర్చర్లను తీసుకుని మరింత బలమైన యూరోపియన్ రిసెర్చ్ సెంటర్లను నిర్మించుకుంటున్నాయి. ఇది ట్రంప్ ధోరణి మరింతగా ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఉపయోగ పడుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.పైగా అమెరికాలో మధ్యలో నిలిచిపోయిన అధ్యయనాలను తమ దగ్గర కొనసాగించుకోవచ్చని, ఆ అకడమిక్ స్వేచ్ఛను కల్పిస్తామని ఫ్రాన్స్ లోని యూనివర్సిటీలు ప్రకటించాయి. దాంతో అమెరికాలో నిరుద్యోగులుగా మారిన సైంటిస్టులు, రిసెర్చర్లు యూరప్ దేశాలకు తరలి వెళుతున్నారు. అమెరికానుంచి వచ్చేస్తున్న సైంటిస్టుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని జర్మనీ ఆర్ధిక మండలి సూచించింది. ఇది యూరప్, జర్మనీలకు కలసి వచ్చిన అవకాశంగా ఆ దేశం ప్రకటించింది.