34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

బీజేపీకి కంట్లో నలుసులా రాజాసింగ్‌!

రాజాసింగ్‌. గోషా మహల్‌ బీజేపీ ఎమ్మెల్యే. బలమైన హిందూ నేతగా అందరికీ తెలుసు. హిందూయిజం విషయంలో ఎవరినీ లెక్క చేయరన్న పేరుంది. వాస్తవానికి బీజేపీనే హిందూత్వ పార్టీగా అందరూ చెప్పుకుంటే.. ఆ పార్టీ సిద్ధౄంతాలను మించి రాజాసింగ్‌ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తారు. అలాంటి రాజాసింగ్‌ బీజేపీకి ఇప్పుడు కంట్లో నలుసుగా మారారన్న చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో, మీడియాలో బీజేపీ రాష్ట్ర నేతల తీరును కడిగి పారేస్తున్నారు. వాట్సప్‌ మెస్సేజ్‌లతో ముఖ్యనేతలను ఆడుకుంటున్నారు. నియామకాల విషయంలో, పార్టీ సిద్ధాంతాలను అనుసరించే విషయంలో, ఇతర పార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలను తప్పు బడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సొంత పార్టీ నేతలపైనే యుద్ధం ప్రకటిస్తున్నారు. ఓ దశలో తనకు పార్టీతో పనిలేదని, పార్టీలో ఉండమంటే ఉంటా.. లేదంటే వెళ్లిపోతా అని కూడా భావోద్వేగంగా మాట్లాడిన సందర్భం ఉంది.

ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి హస్తినలో కసరత్తు సాగుతోంది. అధిష్టానం అన్ని కోణాల్లో విశ్లేషించి బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని తర్జన భర్జన పడుతోంది. ఈ సమయంలో గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తనదైన శైలిలో అధిష్టానానికి సూచనలు చేశారు. రాష్ట్ర స్థాయి నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానమే నేరుగా విశ్లేషించి నియమించాలని డిమాండ్‌ చేశారు. కొంత మంది గ్రూపిజం కారణంగా బీజేపీకి తెలంగాణలో ఇప్పటి వరకు చాలా నష్టం జరిగిందని.. ఇంకా జరుగుతూనే ఉందన్నారు. ఒకవేళ.. అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ, రాష్ట్ర స్థాయి నేతలు డిసైడ్‌ చేస్తే.. కొత్త అధ్యక్షుడు రబ్బర్‌ స్టాంప్‌ మాదిరిగానే ఉంటారని వ్యాఖ్యానించారు. అందుకే హై కమాండే అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నారు. కమిటీని కేంద్ర కమిటీ నిర్ణయిస్తేనే బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. గతంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులుగా పనిచేసిన వారు గ్రూపు రాజకీయాలతో పార్టీకి తీవ్రనష్టం చేశారని ఆరోపించారు. గ్రూపిజం కారణంగా మంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చేతులు కట్టేశారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీశాఖకు వచ్చే కొత్త అధ్యక్షుడు.. రాష్ట్ర సీఎంతో రహస్య మంతనాలు జరుపుతూ బ్యాక్‌డోర్‌ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని అధిష్టానమే నేరుగా నియమించి.. ఫ్రీ హ్యాండ్‌ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కొత్తగా నియమితుడయ్యే అధ్యక్షుడు రహస్య సమావేశాలకు దూరంగా ఉండాలని రాజాసింగ్‌ సలహా ఇచ్చారు.

కొత్తగా నియామక మయ్యే బీజేపీ రాష్ట్ర కమిటీలో ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని రాజాసింగ్‌ సూచించారు. అయితే, ఈ విషయాలను తాను ముందుగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని, తన మాట వినకపోవడం వల్లే ప్రజల ముందు పెడుతున్నానని రాజాసింగ్‌ చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలకు చెప్పాలే గానీ, మీడియా ముందుకు ఎందుకు వెళుతున్నారని తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో నామినేటెడ్‌ పోస్టులు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఎవరికీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ఇక, నిన్నటికి నిన్న మరో బాంబు పేల్చారు రాజాసింగ్‌. సొంత పార్టీ బీజేపీలోనే తనకు వెన్నుపోటు దారులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచనలో ఉన్నారని రాజాసింగ్ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై పీడీ యాక్ట్‌ పెట్టి జైలుకు పంపిందని, ఆ సమయంలో కొంతమంది బీజేపీ నేతలు కూడా పోలీసులకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. నీపై పీడీయాక్ట్‌ పెడుతున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా లోపలేయండి అంటున్నారని ఒక పోలీసు అధికారి తనతో చెప్పారని రాజాసింగ్‌ వెల్లడించారు. తనను జైలులో పెట్టినప్పడు కార్యకర్తలు అండగా నిలిచారని చెప్పారు.

ఇక, గత నెలలో పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను నియమించారు. ఆ సమయంలోనూ రాజాసింగ్‌ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యేగా తనకు, తన ప్రతిపాదనలకు విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. పార్టీలో చేరినప్పటి నుంచి తనను వేధింపులకు గురిచేస్తున్నారని, ఇక వాటిని తట్టుకోవడం తన వల్ల కావడం లేదని కూడా రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. పార్టీకి అవసరం లేదనుకుంటే బయటకు వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా రాజాసింగ్‌ ఆ సమయంలో బాంబు పేల్చారు. తన సూచనలను పక్కనబెట్టి.. ఎంఐఎంతో అంటకాగిన వ్యక్తికి గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటని ఆయన విమర్శించారు. దళిత లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచించినట్టు చెప్పారు. తన ప్రతిపాదన పక్కన పెట్టడంపై పార్టీకి చెందిన కీలక నేతకు ఫోన్‌ చేసి అడిగితే ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారన్నారు. తాను ఇప్పటి వరకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లతోనే పోరాటం చేస్తూ వచ్చానని, కానీ.. ఇప్పుడు సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా అధ్యక్షుడి పదవి అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడం ప్రతిచోటా జరుగుతుందని, … కానీ, తన సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో పార్టీ ముఖ్యులు సంజాయిషీ ఇవ్వాలని, వెంటనే పార్టీ అధ్యక్షుడిని మార్చాలని రాజాసింగ్‌ ఆ సమయంలోనే డిమాండ్‌ చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com