పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తమిళనాడులో సైతం హల్చల్ చేస్తున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ కావాలని పోరాట బాట పట్టినప్పుడు తమిళనాడు నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చాయి. తమిళ నేతలంతా పవన్ పై వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. నటుడు ప్రకాష్ రాజ్ అయితే బిజెపి అజెండా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న హిందీ భాషపై జరిగిన వివాదంలో కూడా పవన్ తమిళ నేతల తీరును తప్పు పట్టారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర నేతలతో లేని విధంగా తమిళ నేతలతో పవన్ ఆగ్రహంగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడులో జనసేన విస్తరించాలన్న ఆలోచనతో ఇదంతా చేసినట్లు ప్రచారం ప్రారంభమైంది.
అందుకు తగ్గట్టుగానే పవన్ సైతం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. వరుసగా తమిళ నేతలతో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో.. ఓ తమిళ టీవీ పవన్ కళ్యాణ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో తన జనసేన తమిళనాడులో విస్తరిస్తానని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ హిందీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ నిర్బంధంగా నేర్పించాలనే విధానానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను స్వచ్ఛందంగానే తమిళంతో పాటు హిందీని నేర్చుకున్నట్లు తెలిపారు.
అయితే ఉపముఖ్యమంత్రి పవన్ హిందీ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి లేని భయం.. దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకని ప్రశ్నించారు. నేతలు హిందీలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని మాత్రం విమర్శిస్తుంటారని తప్పు పట్టారు. తమిళనాడులో బిజెపి తప్పకుండా ఎదుగుతుందని, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని చెప్పారు. భవిష్యత్తులో జనసేన సైతం తమిళనాడులో విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో తమిళనాడులో జనసేనను అభిమానించేవారు పెరుగుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో భిన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని సైతం జై కొట్టే వారు ఉన్నారు. అందుకే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి తమిళనాడులో అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలను తమిళనాడు వాసులు ఎక్కువగా వాచ్ చేస్తుంటారు.
చిత్తూరు జిల్లాలో కాపు సామాజికవర్గం బలిజ వారి ప్రభావం అధికం. ఏపి సరిహద్దు జిల్లాలు కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువాన్నమలై జిల్లాలతోపాటు చెన్నై నగరంలో తెలుగు వారి ప్రభావం అధికం.
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన విజయ్ కాంత్, రాధిక, ధనుష్, విజయ్ తదితరులు బలిజ సామాజికవర్గం వారే కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొని జనసేనకు వీరు మద్ధతు పలికితే తమిళ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోవడం ఖాయం.
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకే ముక్కలు చెక్కలైంది. ఆ పార్టీ ప్రభావం తగ్గింది. డిఎంకే మరింత బలోపేతం అవుతోంది. డీఎంకేకు చెక్ పెట్టేందుకు బిజెపి వ్యూహంలో భాగంగానే జనసేన తమిళనాడు ఎన్నికలకు సిద్దమవుతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా.