అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా ముందే మాటల యుద్ధం మొదలుపెట్టారు. సై అంటే సై అన్నట్టుగా రెచ్చిపోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు, ఒప్పందాలు జరగకుండానే జెలెన్ స్కీ పర్యటన ముగిసింది.
భేటీలో ఏం జరిగిందంటే…?
దాదాపు 40 నిమిషాలకు పైగా జరిగింది ఇరువురి భేటీ. అది కూడా మీడియా ముందే. ఈ భేటీలో మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే.. లేదంటే మీ దారి మీరు చూసుకొంది అని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే భవిష్యత్తులో రష్యా తమపై యుద్ధం చేస్తే రక్షణ కల్పించాలని ఒత్తిడి చేశారు. అయితే ఇలా ఒత్తిడి తీసుకురావడం ట్రంప్‌కు కోపం తెప్పించింది. దీంతో మాట మాట పెరిగింది. ఇన్నాళ్లుగా మీకు సాయం చేస్తూ వస్తున్నాం.. కానీ మాతో మాట్లాడే పద్ధతి ఇది కాదు.. ఇది చాలా అవమానకరంగా ఉంది. మీరు మాతో ఒప్పందం చేసుకోకుంటే.. మేం ఈ యుద్ధం నుంచి తప్పుకుంటాం. అప్పుడు మీరు ఒంటరిగా పోరాడాలి. ఇంతకుమించి మీకు వేరే మార్గం లేదు. కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారు.. ఇది మూడో ప్రపంచయుద్ధానికి తెరతీసే ప్రమాదం ఉందని ట్రంప్ చెప్పారు.
ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా జెలెన్ స్కీపై మండిపడ్డారు. ఇన్నేళ్ల నుంచి సాయం పొందారు. కానీ కనీసం ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పారా? అని ప్రశ్నించారు. అంతేకాదు దౌత్య పద్ధతిలో సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అయితే ఎలాంటి దౌత్యం అని జెలెన్ స్కీ ఎదురుప్రశ్న వేశారు. కాల్పుల విరమణ చేపట్టాలని వాన్స్ చేసిన సూచనను తోసిపుచ్చారు. దీంతో ఈ భేటీ అర్థాంతరంగా ముగిసింది. ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు.
ట్రంప్ రియాక్షన్..
జెలెన్ స్కీ కాస్త ఓవర్‌యాక్షన్ చేసినట్టు అనిపించింది అన్నారు ట్రంప్. మేం శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం.. ఆయన యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. ఆయన మళ్లీ చర్చకు రావాలని చూస్తున్నారు. కానీ శాంతి నెలకొనాలని ఆయనకు లేదు. అందుకే మేం మళ్లీ చర్చలు కొనసాగించం అని తేల్చి చెప్పేశారు.
సారీ చెప్పేది లేదన్న జెలెన్ స్కీ..
తనకు అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రజలపై గౌరవం ఉంది కానీ.. సారీ చెప్పేది లేదన్నారు జెలెన్ స్కీ. తాను ఏ తప్పు చేయలేదని.. అమెరికా చేసిన దాంట్లో స్నేహం ఎక్కడ ఉందంటూ రిటర్న్ క్వశ్చన్ వేశారు. ట్రంప్ తటస్థంగా ఉండాలి.. అది కూడా తమవైపే ఉండాలని చెప్పారు. తనకు రష్యాపై ఉన్న అభిప్రాయం మారదన్నారు.
జెలెన్ స్కీ మద్ధతుగా కెనడా, ఫ్రాన్స్..
ఈ మీటింగ్ ముగియగానే జెలెన్ స్కీకి మద్దతుగా కెనడా, ఫ్రాన్స్ స్పందించాయి. అమెరికా తీరును తప్పు పడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ స్పందించారు. వీరిందరికి కృతజ్ఞతలు తెలిపారు జెలెన్ స్కీ.
సెటైర్లు వేసిన రష్యా..
జెలెన్ స్కీ, ట్రంప్ డైలాగ్ వార్‌పై రష్యా స్పందించింది. ఇది జెలెన్ స్కీ నిజ స్వరూపమని తెలిపింది. సాయం చేసిన వారికి జెలెన్ స్కీ ఎంత విలువ ఇస్తారో ఇదే ఉదాహరణ అని చెప్పింది. అంతేకాదు.. జెలెన్ స్కీ పై దాడి చేయకుండా ట్రంప్ బాగా కంట్రోల్ చేసుకున్నారంటూ సెటైర్లు వేసింది రష్యా.