23.7 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

జెలెన్ స్కీ మొండితనం…ట్రంప్‌ దుందుడుకు వైఖరి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దుందుడుకు వ్యవహారంతో అమెరికా పరువు మంటగలిసినంత పని అయింది. మిత్ర దేశంతో పని చక్క బెట్టాల్సింది పోయి ఒంటెద్దు పోకడలకు పోయాడు ట్రంప్. జెలెన్ స్కీ మొండి వైఖరితో ట్రంప్ పరివారానికి పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తో జరిగిన సమావేశంలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు విమర్శల పాలు కాగా జెలెన్‌ స్కీ ధైర్యాన్ని కొనియాడుతున్నారు.

రెండు దేశాల మధ్య ఖనిజాలపై ఒప్పందమే ఎజెండాగా డొనాల్డ్ ట్రంప్‌, జెలెన్‌ స్కీ వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఓవల్‌ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జెలెన్ స్కీ ఒప్పందం కుదుర్చుకో.. లేదంటే మేము బయటకు వెళ్లిపోతామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ పెద్ద సమస్యలో చిక్కుకుందనగా.. దానికి జెలెన్‌స్కీ అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

ఉక్రెయిన్‌, రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్‌స్కీ వ్యవహారం సరికాదని మండిపడ్డారు ట్రంప్‌. ఉక్రెయిన్‌ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని, జెలెన్‌ స్కీ పనులతో ఆ దేశానికి చెడ్డ పేరొస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌కు 350 బిలియన్ల సాయం అందించామని మమ్మల్ని శాసించే పరిస్థితుల్లో లేరని ట్రంప్‌ అన్నారు. ఈ క్రమంలో  జెలెన్‌ స్కీని స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌ అని ట్రంప్‌ అన్నారు.

ట్రంప్‌, జెలెన్‌స్కీ వాగ్వాదంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కలగజేసుకుని… గట్టిగా మాట్లాడవద్దని జెలెన్‌స్కీకి హితవు పలికారు వాన్స్‌. రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పగా… ఎలాంటి దౌత్యమని జెలెన్‌ స్కీ ఎదురుప్రశ్నించారు. దీంతో వాన్స్‌ అసహనానికి గురయ్యారు.

చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజ ఒప్పందాంలపై సంతకాలు చేయకుండా వైట్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు జెలెన్‌స్కీ. ఇద్దరి అధ్యక్షుల విందు ఈ వివాదంతో రద్దైంది. ఇక అక్కడి మీడియా తలపొగరు ప్రశ్నలు కూడా అలాగే సాగాయి. అమెరికా అధ్యక్షుడితో సమావేశానికి సూట్‌ లేకుండా ఎలా వచ్చారని, అమెరికా అంటే గౌరవం లేదా అని ఓ విలేకరి ప్రశ్నించాడు. ప్రస్తుతం యుద్ధంలో ఉండటం వల్ల వేసుకోలేదని సున్నితంగా జవాబిచ్చాడు జెలెన్‌ స్కీ.

దశాబ్దాలుగా అమెరికాతో శ్వేత సౌధంలో సమావేశం అంటే అక్కడికి వెళ్లే వారికి ముచ్చెమటలు పట్టేవి. పెద్దన్నకు అనుకూలంగా జరిగే ఒప్పందాలకు తలూపి రావటం తప్పితే చేసేది ఏమీ లేని పరిస్థితి అక్కడ ఉండేది. అమెరికా వెళ్లి అక్కడే వారి వ్యవహారశైలిని తప్పు పట్టి వచ్చిన జెలెన్‌ స్కీ తీరుకు మొదటి సారి అభినందనలు వస్తున్నాయి.

యుద్ధంతో ఆర్థికంగా చితికిపోతున్నా జెలెన్ స్కీ ధైర్యంగా మాట్లాడటాన్ని విశ్లేషిస్తే అనేక ఆంశాలు గోచరిస్తున్నాయి. అమెరికా తన స్వార్థం కోసం తప్పితే ఏ దేశానికి ఆర్థిక సాయం అందించదని తేటతెల్లమైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com