28.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

ట్రంప్ vs జెలెన్ స్కీ.. మారుతున్న సమీకరణాలు

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. అమెరికా ఇచ్చే ఆర్థిక, ఆయుధ, సైనిక సాయం వల్ల ఈ యుద్ధాన్ని కొనసాగిస్తోంది ఉక్రెయిన్. కానీ ఇప్పుడా పరిస్థితులు మారుతున్నాయి. ఇన్నాళ్లు అండగా నిలిచిన అమెరికా ఇక ఉక్రెయిన్‌కు సాయం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని ఏకంగా ఓ నియంతతో పోల్చాడు కాబట్టి. ఈ ఒక్క మాటతో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ట్రంప్ చెప్పాల్సిందంతా చెప్పేశారు.

ఇంతకీ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలేంటి..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేందుకు జెలెన్‌ స్కీనే కారణమన్నారు ట్రంప్. అసలు దాడులు మొదలు కావడానికి ముందే ఓ ఒప్పందం చేసుకుంటే కొంత భూమితో పోయేది.. ఇప్పుడు ఇంత భూమి కోల్పోవడానికి.. ఇంత మంది ప్రజల ఆస్తులు నష్టం కావడానికి.. సైనికులు మరణించడానికి కారణం ఉక్రెయిన్‌ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు ట్రంప్. జెలెన్ స్కీ అమెరికాతో ఏకంగా 350 బిలియన్ డాలర్లను ఖర్చు చేశేలా చేశారు. అది కూడా ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా. యూరోపియన్ దేశాల కంటే అమెరికా 200 బిలియన్ డాలర్ల సాయం ఎక్కువగా చేసింది. ఒక్క డాలర్ కూడా వెనక్కి వస్తుందన్న గ్యారెంటీ లేదు. నిజానికి ఈ యుద్ధం మనకంటే యూరోప్ దేశాలకు ఎక్కువగా అవసరం. కానీ మనం ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. చేసిన సాయంలో కూడా సగం డబ్బు మిస్ అయ్యిందని జెలెన్ స్కీ చెబుతున్నాడు. దీనికి తోడు ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా ఓ నియంతలా జెలెన్ స్కీ పని చేస్తున్నాడు. ఇప్పటికైనా జెలెన్ స్కీ వేగంగా అడుగులు వేయాలి. లేదంటే ఆయనకు దేశం కూడా మిగలదు. అమెరికా ఈ యుద్ధాన్ని ఆపేందుకు చేయాల్సిందంతా చేస్తుంది. యూరప్ దేశాలు శాంతి కోసం ఏం చేయడం లేదు. జెలెన్ స్కీకి ఈ యుద్ధం ఇలానే కొనసాగాలి.. రావాల్సిన నిధులు రావాలి.. జెలెన్ స్కీ తన దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాడంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ట్రంప్.

జెలెన్‌ స్కీ రియాక్షన్..
ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహిస్తే జెలెన్ స్కీ గెలిచే అవకాశం 4 శాతం మాత్రమే ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ట్రంప్ తప్పుడు సమాచారం అనే ప్రపంచంలో బతుకుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ సమాచారం ట్రంప్‌కు రష్యా నుంచి వచ్చి ఉంటుందన్నారు. తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకోవడం కుదరని పని అన్నారు.

ఓవరాల్‌గా చూస్తే జెలెన్ స్కీ, ట్రంప్ మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. అయితే నెక్ట్స్ ఉక్రెయిన్ ఏం చేస్తుంది అనేదే ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే యూరప్ దేశాలను ఏకం చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. యూరప్‌ కోసం ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేయాలంటున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. కానీ రష్యా మాత్రం ఈ యుద్ధాన్ని ఆపేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇప్పటికే అమెరికాతో చర్చలు మొదలు పెట్టింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ట్రంప్‌తో భేటీ అవ్వడం సంతోషమే అనే స్టేట్‌ మెంట్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటమే తనకు కావాల్సింది అన్నారు.

మొత్తంగా చూస్తే ఏ అమెరికా మాటలు విని నాటోలో చేరేందుకు ప్రయత్నించి రష్యా ఆగ్రహానికి జెలెన్‌ స్కీ గురయ్యాడో.. ఇప్పుడు అదే అమెరికా మొఖం చాటేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. మరి ఈ యుద్ధాన్ని ఇలానే కొనసాగిస్తాడా? లేదా? ట్రంప్‌ విమర్శల ధాటిని ఎదుర్కొంటాడా? ఉక్రెయిన్‌లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com