అయోధ్యలో తిరుమల శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆదివారం టీటీడీ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు హాజరయ్యారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని సరయూ నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉత్తరాది భక్తులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలైన శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తాలను అర్చకులు వల్లించారు.
అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.