37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు -పవన్‌కల్యాణ్‌

• అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ
• జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటాం
• సమష్టిగా పోరాడి… గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం
• కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం
• కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం
• గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిది
• కొండపావులూరులో 10వ ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘విపత్తు నిర్వహణ గ్రామ స్థాయిలోనూ జరగాలి. ప్రతి పంచాయతీలోనూ అత్యవసర సమయంలో వేగంగా స్పందించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు అవసరం అని చెప్పిన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా  మాటలు సదా ఆచరణీయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ దీనిపై ఓ పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ప్రతి పంచాయతీ పరిధిలో విపత్తు సమయంలో సత్వరం స్పందించి, ఆపదలో ఉన్న వారిని కాపాడే బృందాలను తయారు చేస్తాం. వారికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులతో తగిన విధంగా శిక్షణ కల్పించి, వారి మార్గదర్శకంలో ముందుకు వెళ్లేలా పని చేస్తామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదివారం ఉదయం గన్నవరం నియోజక వర్గం కొండపావులూరులో నిర్మితమైన పదో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని సకల హంగులతో కేంద్రం ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. దేశంలోనే భారీ తీర రేఖను కలిగిన మూడో రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. తుపాన్ల తాకిడి అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కు అనుకోని విపత్తులు సంభవిస్తాయి. ఈ విపత్తుల కారణంగా తీర రేఖ పొడవునా నివసించే మత్స్యకారుల జీవనాలు అతలాకుతలం అవుతున్నాయి. వేగంగా స్పందించి, ఆపదలో ఉన్న వారిని నిమిషాల్లో కాపాడటంలో తర్ఫీదు పొందిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ భారత దేశానికి సంబంధించిన ప్రధాన ప్రాంగణం రాష్ట్రంలో ఉండటం వల్ల రాష్ట్రానికి అది పెద్ద భరోసా దక్కినట్లే. దీన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది రాష్ట్రానికి కేంద్రం అందించిన అతి పెద్ద భరోసాగా భావిస్తున్నాం.

• జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సేవలు అమూల్యమైనవి

గతంలో విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమార్స్ ఘటనలో, అచ్యుతాపురం సెజ్ లో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో, విజయవాడకి అనుకోని విధంగా వరదలు ముంచెత్తిన సందర్భంలో కాని.. ఏ సమయంలో చూసుకున్నా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ స్పందించిన తీరు అమోఘం.. అమూల్యం. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టి మరీ విపత్తులో ఈ సంస్థ సభ్యులు స్పందించే తీరు అద్భుతం. ప్రజలందరికీ విపత్తు సమయంలో ఎన్డీఆర్ఆఫ్ ఓ రక్షణ వలయంగా నిలుస్తోంది. 18 ఏళ్ల కాలంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 1,55,700 మంది ప్రాణాలను కాపాడగలిగింది. 8,62,084 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగింది. విపత్తుల సమయంలో చనిపోతే మన వారి కడసారి చూపు అయినా దక్కుతుందా అని ఆలోచిస్తాం. అలాంటిది విపత్తులో ప్రాణాలు కోల్పోయిన 7,465 మంది మృతులను కడసారి తమ వారికి చూపించగలిగాయి విపత్తు నిర్వహణ దళాలు. కేవలం ప్రజలనే కాదు 19,368 మూగజీవాలను అనుకోని విపత్తుల్లో రక్షించి, ప్రధాన మంత్రి మోదీ  చెప్పే వసుధైక కుటుంబం అనే మాటకు తగిన నిర్వచనం అందించగలిగింది. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం వారి సేవలు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జపాన్, నెదర్లాండ్స్ దేశాలు విపత్తు నిర్వహణలో తమదైన రీతిలో ముందుకు వెళ్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా నూతన హంగులతో, సాంకేతికను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తోంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న చొరవ అద్భుతం అని చెప్పాలి.

• వికసిత్ భారత్ లో విపత్తుల నిర్వహణ కీలకం

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్న సమయంలో వికసిత్ భారత్ లో విపత్తు నిర్వహణ అనేది చాలా కీలకం. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, దానికి తగినట్లుగా సన్నద్ధం కావడం అనేది నిరంతర ప్రక్రియ. మారుతున్న ప్రపంచ వాతావరణ పరిస్థితులతోపాటు, స్థానికంగా మారుతున్న వాతావరణ అంశాలను బేరీజు వేసుకొని ముందుకు సాగాలి. రాబోయే విపత్తులను ముందుగానే అంచనా వేసుకొని, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. క్లైమెట్ స్మార్ట్ నేషన్ ను సాధించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ  చేస్తున్న సూచనలను అందిపుచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సైతం ప్రగతి దిశగా ముందుకు దూసుకెళ్తోంది.

• విపత్తులు కేవలం ప్రకృతి సంబంధమైనవి మాత్రమే కాదు

విపత్తులు కేవలం ప్రకృతి సంబంధమైనవి మాత్రమే కాదు. మానవులు చేసినవి కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ఏ స్థాయి విపత్తు ఉండేదో ఊహించాలి. అలాంటి విపత్తు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో, హోంమంత్రి అమిత్ షా సూచనలతో, చంద్రబాబు  నాయకత్వంలో కలసి పని చేశాం. ప్రజలను గత ప్రభుత్వ విపత్తు నుంచి కాపాడగలిగాము. అదే ఈ రోజున ఇక్కడ ఈ ప్రాంగణం ప్రారంభించడానికి దోహదపడింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి కేంద్రం అందిస్తున్న సహకారం అమోఘం. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది రాష్ట్రానికి ఓ అభివృద్ధి సూచిక అని భావిస్తున్నాం. ఇక నుంచి రాష్ట్రానికి మంచి ప్రభుత్వంలో మంచి రోజులు రానున్నాయి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com