37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

షర్మిళ… ఏంటిలా..?

పిలుపివ్వడమేనా..? పని చేయనక్కర్లేదా..?

అధికార పార్టీపై విమర్శలు నామ్ కే వాస్తేనేనా.. ?

ఏపీసీసీ చీఫ్ షర్మిళ తీరుపై కాంగ్రెస్ పార్టీలో విమర్శలు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అవమానించారు.. ఆయన ఏపీలో అడగుపెట్టడానికి వీల్లేదు.. ఆయనకు అడుగడుగునా నిరసనలు తెలియజేయాలంటూ అమిత్ షా పర్యటనకు ముందు రోజు ఏపీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నా.. అంబేద్కర్-అమిత్ షా ఎపిసోడును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్సుగా తీసుకుంది కాబట్టి.. ఏపీలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేస్తాయని అంతా భావించారు. కానీ షర్మిళ ఇచ్చిన పిలుపు పిలుపుకే పరిమితమైనట్టుంది. పిలుపు ఇచ్చిన షర్మిళ కూడా ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదు. దీంతో ఏపీ పీసీసీ వర్గాల్లో షర్మిళ పని తీరు మీద విమర్శలు వస్తున్నాయి. అసలు షర్మిళ వల్ల ఏపీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏమన్నా ఉందా..? అనే కోణంలో బహిరంగంగానే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే షర్మిళను వ్యతిరేకిస్తూ ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సహా ఇంకొంత మంది నేతలు షర్మిళకు వ్యతిరేక వర్గంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ షర్మిళ వ్యవహరిస్తున్న తీరు మీద ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం మీద ఫిర్యాదులు చేస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ షర్మిళ తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బయటకు చెప్పేవారు కొందరైతే.. చెప్పలేని వారు చాలా మంది ఉన్నారు.

వాస్తవానికి షర్మిళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలియ్యేనాటికి ఏపీ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కొద్ది మంది సీనియర్లు కావచ్చు.. కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ అనుకున్న నేతలు కావచ్చు.. చాలా ఊహించుకున్నారు. వైఎస్ తనయగా షర్మిళ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వెంటనే రాకున్నా.. కనీసం ఉనికి నిలుపుకునే పరిస్థితి అయినా వస్తుందని భావించారు. కానీ వారి అంచనాలు కావచ్చు.. ఆశలు కావచ్చు.. మొత్తం రివర్స్ అయ్యాయి. వైఎస్ ఛర్మిషా షర్మిళకు ఉందని.. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన చాలా మందిని తిరిగి వైసీపీ గూటికి తీసుకురావడంలో ఆమె సక్సెస్ అవుతారని అంతా భావించారు. కానీ అవేం జరగలేదు సరికదా.. నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్టుగా మారింది ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వచ్చిన కొంత కాలానికే షర్మిళ తీరు అర్థమై.. వెంటనే వెనక్కు వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు వైసీపీలో టిక్కెట్ దక్కించుకోలేని కొంత మంది ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారే తప్ప.. ఆ తర్వాత పార్టీకి వారు ఉపయోగపడింది లేదు.. వారిని పార్టీ ఉపయోగించుకున్నది లేదు. అసలు గడచిన ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లోనే షర్మిళ తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమకు టిక్కెట్లు ఇవ్వలేదనే విమర్శలే కాకుండా.. ఏకంగా ఆర్థికపరమైన అవకతవకలు కూడా చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిళ ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అతి తక్కువ కాలంలో ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ తర్వాత కూడా ఆమె వ్యవహర శైలిలో ఏ మాత్రం మార్పు లేదు.

ఇది చాలదన్నట్టు షర్మిళ.. షర్మిళ అనుచరులుగా ఉన్న వారు.. అలాగే ఆమె కోటరీలో ఉన్న మరికొందరు నేరుగా అధికార పార్టీ పెద్దలతో ఆర్థిక పరమైన లావాదేవీలు చేపట్టడంలో బిజీగా ఉన్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. షర్మిళ కోటరికి చెందిన వారిలో కొంత మందికి కూటమి ప్రభుత్వంలో పనులు రైట్ రాయలుగా అయిపోతున్నాయనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ కూటమికి అనుకూలంగా షర్మిళ వ్యవహరిస్తున్నారనే విమర్శలను చేయడమే కాకుండా.. కొందరు ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగా అమిత్ షా టూర్ విషయంలో షర్మిళ తీరు ఉందని గుర్తు చేస్తున్నాయి సదురు షర్మిళ వ్యతిరేక వర్గాలు. నిరసనలకు పిలుపివ్వడమే తప్ప.. వాటిని ఎక్కడా చేపట్టకపోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com