-
సీఎం కుర్చీపై… కూటమిలో ఫైట్
– రాజుకుంటున్న నిప్పు
– కడప టీడీపీ నేత మాటలతో మంటలు
– జనసేన నేతల కౌంటర్లు, సలహాలు
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో ‘స్వేచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమం జరుగుతోంది. సభావేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, మంత్రులు, పార్టీ అధికార, అనధికార నేతలు, ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వేదికపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుని కోరారు. ఇదిప్పుడు కూటమిలో ఆరని చిచ్చుగా మారింది.
ఈ నేపథ్యంలో జనసేన నేతలు మండిపడుతున్నారు. జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ ఇచ్చిన కౌంటర్…కూటమికి నిప్పు పెట్టింది. ఇంతకీ ఆయనేమన్నారంటే…లోకేష్ ని డిప్యూటీ సీఎంని చేయాలనే టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి ప్రతిపాదన బాగుంది..పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ని కూడా సీఎంని చేయాలి. వయసైపోయిన చంద్రబాబుని కేంద్రమంత్రిగా పంపించాలి. ఈ బాధ్యత కూడా శ్రీనివాసరెడ్డి తీసుకోవాలి…అని స్టాంగ్ర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే ఉండి ఎమ్మెల్యే రఘురామక్రష్ణంరాజు కుదురుగా ఉండకుండా లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలంటూ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తూ ఎక్స్ లో మరో పోస్ట్ పెట్టారు. వీరి సరసన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరారు. ఆయన బాధ ఆయనది అన్నట్టు మారింది.
ఇంతకీ ఆయనేమన్నారంటే జనసేన పార్టీలోనే కాదు, మా టీడీపీలో కూడా నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వారికి మనసులున్నాయి. వాటికి కొన్ని మనోభావాలున్నాయి. లోకేష్ బాబే మా డిప్యూటీ సీఎం అని ప్రెస్ మీట్ పెట్టి బల్లగుద్ది మరీ చెప్పారు. మండుతున్న అగ్గిలో ఆయన కొంచెం ఆజ్యం పోశారు.
ఇంత జరుగుతుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించలేదు. బహుశా ఆయన కూడా డిఫెన్స్ లో పడినట్టుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీకి అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తున్న ఆయనకు చంద్రబాబు చేస్తున్న పని నచ్చడం లేదన్నట్టుగా మారింది. ఎందుకంటే చంద్రబాబు లాంటి సీనియర్ నేత దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేయడం తనకి నామోషీ కాదు.
అదే కష్టపడకుండా షార్ట్ కట్ లో వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చైర్ లో లోకేష్ కూర్చుంటే, ఆయన దగ్గర చేతులు కట్టుకుని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తారని అనుకోవడం పార్టీ నేతలకి, కార్యకర్తలకి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం మళ్లీ పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అన్న చిరంజీవిలా నట్టేట ముంచడని అనుకుంటున్నారు.
ఈ సమయంలో జరగబోయే రాజకీయ మార్పులు పవన్ కళ్యాణ్ కి ఇబ్బందికరంగా మారనున్నాయి. ఇంతవరకు మద్దతిచ్చినట్టుగానే లోకేష్ కి మద్దతిస్తాడా? ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? నాడు చంద్రబాబు చెప్పినట్టు ఏపీకి ఒకరే సీఎం, ఒకరే డిప్యూటీ సీఎం అన్న మాటలు ఎంతవరకు నిజం? మొత్తానికి కూటమిలో సీఎం కుర్చీపై ఫైట్ గట్టిగానే జరిగేలా కనిపిస్తోంది. ఆ కుర్చీని మడతబెట్టి పాట వేస్తూ అప్పుడే మీమ్స్ స్టార్ట్ అయ్యాయి.