తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి దర్శనానికి సంబంధించి తెలంగాణ నాయకుల సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. కలియుగదైవం వేంకటేశ్వరస్వామి దర్శనం విషయంలో ఇలా వ్యవహరించడమేంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ ఈ అంశం రగులుతూనే ఉన్నప్పటికీ.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫేక్ న్యూస్‌తో మరోసారి ఈ అంశం హైలైట్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులకు కూడా ప్రొటోకాల్ అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం, అక్కడికి వెళ్లే భక్తులకోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులు ఇచ్చే సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకునేవారు. ఆ లేఖలు ఉన్న భక్తులకు సాధారణ భక్తులకంటే ప్రాధాన్యత ఇచ్చేవారు. దీంతో, ఆ సంప్రదాయం మొదటినుంచీ కొనసాగుతోంది. ఇక, 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో, సొంతరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు మాత్రమే స్వీకరిస్తున్నారు. తెలంగాణ నుంచి వెళ్లే సిఫారసు లేఖలను నిర్మోహమాటంగా పక్కనబెడుతున్నారు. దీనిపై ఎన్ని డిమాండ్లు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా టీటీడీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దలు గానీ, టీటీడీ పాలక సంస్థ పెద్దలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో, ఆ అంశంపై పదేళ్లు దాటినా ఇంకా క్లారిటీ రావడంలేదు.
ప్రధానంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వాళ్లతో ఆంధ్రప్రదేశ్ భక్తులు ఏ స్థాయిలో ఉంటారో, తెలంగాణకు చెందిన వివిధ జిల్లాల నుంచికూడా అంతే స్థాయిలో భక్తులు తరలివస్తారు. అలాగే, ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఆలోచనల్లో గానీ భక్తిలో గానీ తెలుగువాళ్లందరిదీ ఒకే మనోగతం అనేది కాదనలేని వాస్తవం. అందుకే తెలంగాణ వాసులు కూడా మొదటినుంచీ ఏపీతో సమానంగా తిరుమల శ్రీనివాసుడి విషయంలో సదుపాయాలు, దర్శనాలు కల్పించాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పలుమార్లు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. కానీ, దీనిపై నిర్ణయాత్మక చర్చలు జరగడం లేదు. మామూలుగా చూస్తే ఈ అంశం చాలా చిన్నదిగా అనిపించొచ్చు గానీ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి సన్నిధికి నిత్యం వెళ్లే లక్షల మంది భక్తులకు అక్కడి పరిస్థితులేంటో, సిఫారసు లేఖల ఆవశ్యత ఎంతగా ఉంటుందో తెలుస్తుంది. అందుకే వీలైనంత తొందరగా టీటీడీ బోర్డు, ఏపీ సర్కారు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.