తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారయ్యింది. తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటినుంచీ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజల్లోకి ఒకేసారి వచ్చారు. అడపా దడపా పార్టీ ముఖ్యనేతలతో, పార్టీ శ్రేణులతో ఫామ్‌హౌజ్‌లోనే సమావేశాలు నిర్వహించారు. అయితే, ఇప్పుడు బయటకు వస్తున్నా.. కాచుకో! అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవలే ఫామ్‌హౌజ్‌లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ గమనిస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదంటూ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా కౌంటర్ ఇస్తున్నారు. అయితే, కేసీఆర్ తాను ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భేటీలో కేసీఆర్ పాల్గొంటున్నారు. 19వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుండి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి యేడాది దాటింది. మరోవైపు.. ఏ సమయంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు చూస్తే.. బీఆర్‌ఎస్ పార్టీ.. టీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించి రెండున్నర దశాబ్దాలు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. త్వరలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందా? లేదా? అన్న విషయం కూడా కేసీఆర్ బయటకు వచ్చాకే డిసైడ్ చేస్తామని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. దీంతో కేసీఆర్ భారీ ప్లాన్‌తోనే పొలిటికల్ గోదాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
చాలా కాలం తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ల మాజీ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు ఆహ్వానం పంపిస్తున్నారు. ఇక, ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి రెండున్నర దశాబ్దాలు గడుస్తుంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం.. తదితర అంశాలపైనా విస్తృత స్థాయిలో ఈ సమావేశంలో చర్చించనున్నారు.