23.2 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

ఈసారి వేసవిలో ప్రచండ భానుడేనట!

వేసవి కాలం సమీపిస్తోంది. మండే ఎండలు తలచుకుంటేనే భయపెడుతున్నాయి. ప్రతి సమ్మర్‌లోనూ ఇది సర్వ సాధారణమే. కానీ, ఈ సారి ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటోంది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా తెలంగాణలో ఎండల తీవ్రత ఈసారి భారీగా పెరుగుతుందట. హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేసింది. వడగాలులు, అత్యధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

తెలంగాణలో ఇప్పటికే వేసవి కాలం ఆనవాళ్లు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలకు చేరుకోవచ్చని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారం రోజుల్లో హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. 2017లో వీచిన మాదిరిగా భారీ వడగాలులు వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 2017లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడు 23 రోజుల పాటు వడగాలులు వీచాయి. కాబట్టి ప్రజలు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే సూచిస్తున్నారు. తీవ్రమైన వడగాలులు, ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. డీ హైడ్రేట్‌ సమస్య ఎదురుకాకుండా పుష్కలంగా నీరు తాగాలని సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని చెబుతున్నారు. భారీ వడగాలులు, ఉష్ణోగ్రతల నుంచి బయటపడడానికి తేలికైన తెలుపు రంగు దుస్తులను ధరించాలని.. పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉంటేనే మంచిదంటున్నారు.

ఈ యేడాది రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్ ఏయిర్ క్వాలిటి ఇండెక్స్ 160గా నమోదవుతుందని అంటున్నారు. అయితే, ఇది శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి ప్రాణానికే ముప్పు కలిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడైతే ఫిబ్రవరి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి నుంచి ఏప్రిల్ 15 వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మార్చి నెల మధ్య వరకు 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com