26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

బీజేపీలో రాజాసింగ్‌ కామెంట్స్‌ కలకలం

తెలంగాణ బీజేపీలో రాజాసింగ్‌ ఓ సంచలనం. బలమైన హిందూ నేతగా అందరికీ పరిచితం. హిందుత్వం కోసం సొంత పార్టీని కూడా ధిక్కరించగలిగే దూకుడు స్వభావం ఉన్న నాయకుడు. తాను అనుకున్నది ముక్కు సూటిగా ప్రకటించేస్తారు. ఎవరేం అనుకున్నా.. తను చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. తాను చేయాలనుకున్న ఆరోపణలు చేసేస్తారు. ఇలా.. బలమైన హిందూ నేతల్లో ఒకరిగా ఉన్న రాజాసింగ్‌కు ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తన దూకుడు స్వభావం కారణంగా పలుసార్లు చిక్కుల్లో పడిపోతుంటారు. పార్టీలో కూడా ఇబ్బందులు ఎదురైన సందర్భాలు అనేకం. అయితే, ఇప్పుడు మరోసారి రాజాసింగ్‌ తన మనసులో మాటలు బాహాటంగా బయటపెట్టారు. పార్టీలో అంతర్గతంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కన్నెర్ర జేశారు.

ఇటీవలే తెలంగాణ బీజేపీలో జిల్లా స్థాయి అధ్యక్షుల నియామకాలు మొదలయ్యాయి. మొదటివిడత జాబితా కూడా బయటకు వచ్చేసింది. మిగిలి ఉన్న జిల్లాల పార్టీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రకటించిన బీజేపీ జిల్లా అధ్యక్షులకు సంబంధించి పలు జిల్లాల్లో అసంతృప్తులు బయటపడుతున్నాయి. కొందరు సీనియర్లు లోలోపతే రగిలిపోతున్నారు. కానీ, బయట పడటం లేదు. ఇదే క్రమంలో గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి వ్యవహారంలో దుమారం మొదలయ్యింది. గోల్కొండ బీజేపీ అధ్యక్షుడిగా ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యం ఇవ్వాలని తాను పార్టీ అధిష్టానానికి సూచించినట్టు ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కానీ, ఇప్పుడు ప్రకటించిన జాబితాలో.. ఎంఐఎంతో కలిసి తిరిగేవారికి ఆ పదవి ఇచ్చారని రాజాసింగ్‌ మండిపడుతున్నారు. ఆవేశంతో రగిలిపోయిన రాజాసింగ్‌ కీలక నేతలకు ఫోన్ చేసి దీనిపై ప్రశ్నించారు. అయితే, రాజాసింగ్‌ క్వశ్చన్‌ చేసి నేతలు.. ఆ విషయం తమకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

ఈ పరిణామాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. తాను ఇప్పటివరకూ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో యుద్ధం సాగిస్తూ వచ్చానని.. కానీ, ఇప్పుడు సొంత పార్టీతోనే యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. జిల్లా అధ్యక్ష పదవి అనేది ఎమ్మెల్యే లేదా ఎంపీ సూచించిన వ్యక్తికి ప్రతీ చోటా ఇవ్వడం ఆనవాయితీ అని, మరి.. పార్టీలో తన సూచనలను ఎందుకు పక్కన పెట్టారని రాజాసింగ్‌ మండిపడుతున్నారు. జీవితంలో ఇప్పటివరకు తాను ధర్మ ప్రచారమే చేస్తున్నారని, బ్రోకరిజం తాను నేర్చుకోలేద న్నారు రాజాసింగ్‌. అలాంటి కొందరి వల్లే పార్టీ వెనుకబడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సిందని, రిటైరైన వ్యక్తుల వల్ల బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేకుండా పోతోందని రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే.. పార్టీలో చేరినప్పటి నుంచీ.. తాను వేధింపులు భరిస్తున్నారని, ఇకపై తట్టుకోలేక పోతున్నట్లు ఆయన తెలిపారు. పొమ్మనకుండా పొగపెడుతున్నారా? అని కూడా సందేహం వ్యక్తం చేశారు. పార్టీకి తన సేవలు అవసరం లేదు.. వెళ్లిపో అని చెబితే బయటకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్‌ కుండ బద్దలు కొట్టారు.

ఇప్పుడు రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పార్టీలో దుమారం మొదలైంది. రేపో మాపో మరి కొందరు అసంతృప్త నేతలు నోరు విప్పే అవకాశముందని అంటున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 2014లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ వేవ్‌లోనూ గెలిచారు. 2014, 2018, 2023లో గోషా మహల్‌ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజాసింగ్ అంటే గోషామహల్.. గోషా మహల్‌ అంటే రాజాసింగ్‌ అనే విధంగా తన స్థానాన్ని అక్కడ పదిలం చేసుకున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com