29.4 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

ఆ పదిమందికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ప్రభుత్వం మారగానే విపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చి ఎం చక్కా పనులు చక్కబెడదాం అనుకున్న జంప్‌ జిలానీ ఎమ్మెల్యేలకు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్‌‌ఘన్‌పూర్), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), ఎం.సంజయ్ కుమార్ (జగిత్యాల) జంప్‌ చేశారు.

గులాబీ గూటి నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన 10 మంది పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారు. అలాగని తిరిగి కారు ఎక్కేందుకు అవకాశం లేకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

భవిష్యత్తు బావుంటుందన్న ఆశతో అధికార పార్టీలో చేరితే..మొదటికే మోసం వస్తుందా అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అంతా భావించారు. కానీ వ్యవహారం బెడిసికొట్టింది.

బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆ పది మంది ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దగా గుర్తించడంలేదు. పార్టీలోని ముఖ్య నేతలు, మంత్రులెవరూ తమను పెద్దగా పట్టించుకోవడంలేదని..పార్టీలోకి వస్తే ఇది చేస్తాం…అది చేస్తామంటూ ఇచ్చిన హామీలపై కనీసం మాట్లాడడంలేదని వారు వాపోతున్నారు.

దీంతో పార్టీ మారి తప్పు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారు. కొంత మంది ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అయితే ఆ పది మందిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవద్దని గులాబీ బాస్ కేసీఆర్ తెగేసి చెప్పారని సమాచారం. పార్టీలోకి వచ్చేందుకు ట్రై చేసిన ఆ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్ అని వారి మొహం మీదే చెప్పేశారట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

మరోవైపు సుప్రీంకోర్టు ఏ క్షణంలో ఎలాంటి తీర్పునిస్తుందో అన్న టెన్షన్ 10 మందిని వెంటాడుతోంది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేటీఆర్, పాడికౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోడానికి ఎంత సమయం తీసుకుంటారని స్పీకర్ పై ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. స్పీకర్ తో పాటు ఆ పదిమంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపింది. దీంతో కోర్టు తీర్పుపై ఆ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆ ఎమ్మెల్యేల పరిస్థితి మింగలేక, కక్కలేక  అన్నట్లుగా ఉందట. తిరిగి వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో… ఎలా ముందుకు వెళ్లాలో…ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com