ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో, పరిపాలన పటిష్టతకు పునాది వేస్తున్న ఈ సమయంలో వరుసగా విపత్తులు, వివాదాలు, ప్రమాదాలు ప్రభుత్వానికి గట్టి సవాళ్లుగా మారుతున్నాయి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రాజధాని నిర్మాణం వంటి కీలక కార్యక్రమాలను అమలు చేయాలనుకునే తరుణంలో ప్రభుత్వం వరుస దెబ్బలు తిన్నది.
విజయవాడ వరదలు – ముంచెత్తిన బుడమేరు :
గత ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన భారీ వరదలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బుడమేరు ఉధృతంగా ప్రవహించి వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. రాత్రింబవళ్ళు ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆహార సరఫరా నుంచి, తాత్కాలిక నివాసాల ఏర్పాటు వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం శ్రమించాల్సి వచ్చింది.
ఎర్రకాలువ ఉగ్రరూపం :
వరదల నుంచి రాష్ట్రం కోలుకుంటున్న సమయంలోనే, ఏలూరు సమీపంలోని ఎర్రకాలువ పొంగిపోవడం వల్ల వేల ఎకరాల్లో పంట పొలాలు నాశనం అయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఇది కూడా సవాల్‌గా పరిణమించింది.
ఫార్మా ప్రమాదాలు – పరిశ్రమల్లో భద్రతపై సందేహాలు :
విశాఖ అచ్యుతాపురంలో ఉన్న ఫార్మా కంపెనీలో జరిగిన రసాయన ప్రమాదం పలువురు ఉద్యోగులు, కార్మికుల ప్రాణాలను బలిగొంది. అనంతరం కాకినాడలోని మరో పరిశ్రమలోనూ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ పరిణామాలతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంతో పాటు.. మృతుల కుటుండాలకు పరిహారం ప్రకటించింది. కానీ, ఈ ప్రమాదాల్లో కోల్పోయిన ప్రాణాలను, నష్టపోయిన కుటుంబాలకు ఆసరాగా ఉన్న కుటుంబ పెద్ద కోల్పోయిన లోటును మాత్రం ఎవరూ తీసుకు రాలేని పరిస్థితి.
తిరుమల తొక్కిసలాట – చరిత్రలోనే ఘోర విషాదం :
ఈ ఏడాది జనవరిలో తిరుమల ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం అధికార యంత్రాంగంపైనా, టీటీడీ శ్రేణులపైనా తీవ్ర విమర్శలకు దారితీసింది. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి. బాధిత కుటుంబాల ఆక్రందన.. ఆ శ్రీవారికే చెందింది. ఇక, ఈ ప్రమాదానికి కొద్ది రోజుల ముందు.. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం వివాదం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
బాణాసంచా పేలుడు, సింహాచలం అపశృతి :
తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా కర్మాగారంలో సంభవించిన పేలుడు 8 మంది అమాయకుల ప్రాణాలు తీసింది. తాజాగా విశాఖపట్నంలోని సింహాచలంలో చోటుచేసుకున్న ఘటనలోనూ ఏడుగురు భక్తులు మరణించారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సహాయక చర్యలు చేపట్టినా ఏడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేవుడి దర్శనానికి వస్తే ప్రాణాలే పోయిన పరిణామం భక్తుల్లో తీరని శోకానికి కారణమవుతోంది.
వరుస ఘటనలు – వైపరీత్యాలు :
ఇలా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ వరుసగా సంభవిస్తున్న విపత్తులు, జరుగుతున్న ప్రమాదాలు, చోటు చేసుకుంటున్న అపశృతులు.. తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అటు.. ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటు..రాష్ట్ర ప్రజల్లోనూ భయాందోళనలు వెంటాడేలా చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాలనమీద కూడా ఈ ప్రభావం పడుతోంది.