- రాజ్ భవన్ లో గవర్నర్ ని కలసిన కాంగ్రెస్ బీసీ నేతలు
- బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపినందకు కృతజ్ఞతలు
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినందుకు కాంగ్రెస్ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్‌ని కలసి బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినందుకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజ్ భవన్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో, విద్యాఉద్యోగాల్లో 42 శాతం రిజజర్వేషన్లు కేటాయిస్తూ చట్టం చేసి దేశానికే రోల్ మోడల్ గా నిలబడిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను చట్టం చేయడానికి ముందు అనుభవిక డేటా (Empirical data) ను ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేయడానికి ఒక క్యాబినేట్ సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ సూచనల మేరకే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసినట్లు పొన్నం ప్రభాక్ వివరించారు. ఈ బిల్లును గవర్నర్ కి పంపితే ఆయన న్యాయపరమైన అంశాలు పరిశీలించి అనుమతి కోసం రాష్ట్రపతికి పంపారని మంత్రి పొన్నం తెలిపారు. బిల్లు రాష్ట్రపతికి పంపినందుకు బీసీ నాయకులం అందరం గవర్నర్ ని కలసి ధన్యవాదాలు తెలపడం జరిగిందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణలో మేము చేసిన కుల గణనను రోల్ మోడల్ గా తీసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో జరగబోయే జనాభా లెక్కల సేకరణలోనే కుల గణన చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తు్న్నామన్నారు. అప్పుడు మేము చేసిన కులగణను విమర్శించిన వారు ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి సూచించారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని అమలు చేయడానికి ఆమోదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం గవర్నర్ ని కలసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు బీర్ల శంకర్, ప్రకాష్ గౌడ్, మకాన్ సింగ్ ఠాకూర్, ఎమ్మెల్సీ విజయశాంతి, కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు తదిరులు ఉన్నారు.