తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణ భారత దేశం పేరుతో ఉద్యమం చేపడుతున్నది ఎందుకో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. అందరి దృష్టినీ మరల్చేందుకే స్టాలిన్ కొత్త పోరాటం మొదలు పెట్టారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దేశంలోనే ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పలువురు డీఎంకే నేతల ప్రమేయం ఉందని కిషన్ రెడ్డి తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దోపిడీ చేసిన వాళ్లు ప్రజల దృష్టి మరల్చేందుకు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు నెలల నుంచి డీఎంకే పార్టీ, తమిళనాడు సీఎం స్టాలిన్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణ భారతదేశానికి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ, దాన్ని ఎదుర్కొంటామనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారని స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ సమావేశానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన డీలిమిటేషన్ అంశాలపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి దివాళా కోరుతనంతో కూడిందని ఆయన విమర్శించారు.
రానున్న 6 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయన్న కిషన్ రెడ్డి.. డీఎంకే పాలన, స్టాలిన్ కుటుంబ అవినీతి, దోపిడీ, నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ఈ పరిణామాల నుంచి తప్పించుకునేందుకు రాజకీయంగా నాటకాలు ఆడేందుకు సిద్ధమయ్యారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తమిళనాడులో తీవ్రమైన అవినీతి, రాష్ట్ర ప్రభుత్వం విధించిన అధిక పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచిందన్నారు. మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, పార్లమెంట్ నియోజకవర్గాలను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
జాతీయ నూతన విద్యా విధానం ఇప్పుడే కొత్తగా ప్రవేశపెట్టలేదని, 1986లో కాంగ్రెస్ హయాంలోనే డీఎంకే మిత్ర ప్రభుత్వం దీనిని ప్రవేశ పెట్టిందన్నారు. అప్పుడు వ్యతిరేకించలేదని, హిందీ యేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించే విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. త్రిభాషా సిద్దాంతం బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైందని, నరేంద్ర మోడీ కొత్తగా ప్రవేశపెట్టలేదని, సి. రాజగోపాలాచారి ఆలోచనలతోనే త్రిభాషా సిద్ధాంతం వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కొఠారి కమిటీ త్రిభాషా సిద్ధాంతాన్ని మరింత బలపరిచిందని, ఇవన్నీ డీఎంకే నాయకత్వానికి తెలుసన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఏ రాష్ట్రంపైన హిందీ భాషను బలవంతంగా రుద్దలేదని చెప్పారు.