స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావును కలిశారు. ఎంవీపీ కాలనీలోని గంటా నివాసానికి అనిల్ రావిపూడి బృందం వెళ్లారు. ఈ సందర్భంగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి, మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించ బోతున్న కొత్త సినిమా గురించి అనిల్ రావిపూడి వివరించారు. ఇద్దరూ కొంతసేపు సమకాలీన అంశాలపై మాట్లాడుకున్నారు. కొత్త సినిమాను తెరకెక్కించే ముందు, ఆ కథతో వచ్చి సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం అనిల్ రావిపూడికి సెంటిమెంట్. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం సింహాద్రి అప్పన్నను అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆ తర్వాత తన శ్రేయోభిలాషి అయిన గంటా శ్రీనివాసరావును కలిసినట్టు అనిల్ రావిపూడి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిని కొత్త కోణంలో.. వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నానని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి పేర్కొన్నారు. చిరంజీవి సినిమాల్లో పాటలకు విశేష ప్రాధాన్యం ఉంటుందని, కొత్త సినిమాలో కూడా అదే ట్రెండ్ చూస్తారన్నారు. స్టార్ సింగర్, మ్యూజిక్ డైరక్టర్ రమణ గోగులతో పాట పాడించే ఆలోచన ఉందని రావిపూడి చెప్పారు. మే నెలలో షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి వివరించారు. వినోదాత్మక, కుటుంబ చిత్రాలతో అనిల్ రావిపూడి ప్రేక్షకులను అలరిస్తున్నారని గంటా శ్రీనివాసరావుతో పాటు గంటా రవితేజ అభినందించారు. ఇటీవల విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.. విజయవంతమైన సందర్భంగా ప్రశంసలు కురిపించారు.