- కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంపు
- గిగ్ వర్కర్ల సంక్షేమానికి పెద్ద పీట
- మధ్య తరగతి పొదుపు, మదుపు చేసుకోవచ్చు
- నౌకా నిర్మాణ రంగానికి పారిశ్రామిక హోదా
- భారీ నిర్మాణ నౌకల నిర్మాణానికి ఊపు
- మరింత మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం
- టూరిజం, హాస్పిటాలిటీ ప్రోత్సాహకాలతో పెరగనున్న రెవిన్యూ
దేశ ప్రజలు, యువత, పేదలు, మధ్య తరగతిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ప్రయోజనకరమైన బడ్జెట్ ను ఈ సారి ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టారని ప్రధాని మోడీ ప్రశంసించారు. దేశంలో లక్షలాదిగా ఉన్న గిగ్ వర్కర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ప్రయోజనాల కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని ఇది శ్రామిక వర్గం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనీ అన్నారు. వార్షికాదాయ పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచడం, అలాగే కొత్త పన్నుల విధానంలో శ్లాబు రేట్ల సవరణ అనే రెండు కీలక నిర్ణయాలతో మధ్యతరగతి వారు సొమ్మును మదుపు, పొదుపు చేసుకునే వీలు కల్పించారని అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వచ్చే వారం డైరక్ట్ టాక్స్ కోడ్ ను ప్రవేశ పెడతామని దానివల్ల వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు ఉపయోగం ఉంటుందని అన్నారు.
ఇక భారీ నౌకల నిర్మాణం
ఈసారి బడ్జెట్ లో రైతులకు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ రంగానికి, నౌకా నిర్మాణ రంగానికి, మారీటైమ్ ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. నౌకా నిర్మాణ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల రానున్న కాలంలో భారీ నౌకల నిర్మాణం ఊపందుకుంటుదన్నారు. అలాగే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుందని, రానున్న కాలంలో 50 ముఖ్యమైన టూరిస్టు స్టేషన్లలో హోటళ్ల నిర్మాణం చేస్తామని తొలిసారి దీనిని మౌలిక వనరుల రూపకల్పన కింద తీసుకు రావడంతో టూరిజం సెక్టర్ ఊపందుకుంటుందని అన్నారు. ధ్యాన భారత్ మిషన్ కింద తాళపత్ర గ్రంధాలు, పురాతన గ్రంథాలను డిజిటలైజ్ చేసి జాతీయ డిజిటల్ లైబ్రరీ రూపకల్పన చేస్తామన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం ద్వారా వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం చూస్తామని,గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అది మేలు మలుపని ప్రధాని ఆకాంక్షించారు.