- వివాదాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
- రహస్య భేటీ పై రాజకీయ వర్గాల్లో చర్చ
- ఇది ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకం గా కాదని అంటున్నా అనిరుద్ రెడ్డి
- కాంటాక్ట్ల పంచాయతీ వాళ్ళని ఈ వివాదం
- ఒక మంత్రి కే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్న అనిరుద్ రెడ్డి
- ముఖ్యమంత్రి వద్దకు చేరిన పంచాయతీ
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను మంత్రులు తిడుతూ ఉంటారు… మంత్రులను శాసనసభ్యులు విమర్శిస్తూ ఉంటారు… శాసనసభ్యులపై నాయకులు, కార్యకర్తులు ఆరోపణలు చేస్తూ ఉంటారు… ఈ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. చిన్న చిన్న వివాదాలను కూడా చిలికి చిలికి గాలివాన చేసుకుంటారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుధ్‌రెడ్డిల మధ్య ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్య యుద్దమే జరుగుతోంది.
పేరుకు రహస్య సమావేశాలైన ఆ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ నాయకులవైతే వివరాలు అందరికీ తెలిసిపోతాయి. రహస్య సమావేశాల్లో పాల్గొన్న నేతలు ఆ విషయాలను కేవలం ఇద్దరికి మాత్రమే చెపుతారు. వారిలో ఒకరు అడిగిన వారు అయితే అడగని వారు రెండో వారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే పార్టీ కాబట్టి నేతలు కూడా బహిరంగంగానే కామెంట్స్ చేసెస్తారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల ఆయన ఏర్పాటు చేసిన ఒక ఫామ్ హౌస్ పార్టీ పై అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వంపై అసంతృప్తితోనే అనిరుద్ రెడ్డి ఈ రహస్య భేటీని ఏర్పాటు చేశారని దేనికి సుమారు 8 నుంచి పదిమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని ప్రచారం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్న అనిరుద్ రెడ్డి ఈ భేటీని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌రెడ్డి ఫామ్‌హౌస్ పార్టీకి హజరైన శాసనసభ్యుల ద్వారానే సమాచారం బయటకు పొక్కడంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తొలుత మీటింగ్ ఉద్దేశాలు ఏంటో తెలియక కంగారు పడ్డ పార్టీ, ప్రభుత్వ పెద్దలు సమావేశ ఉద్దేశాలు తెలిసాక వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివార ఉదయమే మంత్రులందరినీ పిలిచి పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు శాసనసభ్యులు, జిల్లా మంత్రుల మధ్య సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
అయితే అధికార కాంగ్రెస్‌కి అనురుధ్‌రెడ్డి నిర్వహించిన సమావేశం ఇబ్బందిగా మారడంతో ఆయన ఈ పార్టీకి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఒక పార్టీ ఏర్పాటు చేసి కొంతమంది సన్నిహితులతో మాట్లాడిన విషయం వాస్తవమే కానీ తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. అదే సమయంలో అన్ని విషయాలపై ఈ సమావేశంలో చర్చించామని కూడా చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మెజార్టీ కాంటాక్ట్ లు ఇతర ఆర్థికపరమైన పనులు ఒక మంత్రికి మాత్రమే వెళ్లడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలిసింది. అన్ని కాంటాక్ట్ లు ఆ ఒక్క మంత్రికి ఇస్తే ఎలా తమక్కూడా కొంత కేటాయించాలని ఆయన కొద్ది కాలంగా వాదిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సదరు మంత్రి వల్ల తమకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కష్టపడి తాము పని చేస్తున్నామని చివరి నిమిషంలో పార్టీలో చేరి మంత్రి అయిన సదరు నేత అన్ని పనులు తానే తీసుకొని తన అనుచరులకు ఇస్తున్నారని. మిగతా వారికి కాంటాక్ట్ లు రావట్లేదన్నది వారి వాదన.
ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఈ విషయంపై రాష్ట్ర నాయకత్వం కూడా కొంత సీరియస్‌గా ఉన్నట్టుగా తెలిసింది. కాంట్రాక్ట్ల్ పంచాయతీ ఇంటర్నల్ గా ఉండాలి తప్ప ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది.