- దుష్ట సాంప్రదాయలకు తెరలేపుతున్నారు
- ఇటువంటి దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు
- కక్ష సాధింపు రాజకీయాలకు పీఎస్‌ఆర్ అరెస్ట్ పరాకాష్ట
- పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో ఆయన కూటమి కక్ష రాజకీయాలపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్ధలన్నింటినీ దిగజారుస్తున్నారని, దుష్ట సాంప్రదాయలకు తెరలేపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబయ్ నటి జత్వానీని వేధించారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుని ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం పట్ల వైఎస్.జగన్ ఈ సమావేశంలో స్పందించారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్ట్ చేయడానికే ఇటువంటి పనులకు పూనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్.జగన్ అభిప్రాయపడ్డారు. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తప్పుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్.జగన్ గుర్తు చేశారు. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు సృష్టిస్తున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని, తాను మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా అని జగన్ అన్నారు. ప్రభుత్వం ఇలాగే ముందుకు పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ మిగలదన్నారు. ఎంపీ మిధున్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారని ఆయన్ను ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారని తెలిపారు. మన ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైనదని, లిక్కరు అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా… పెంచితే లంచాలు ఇస్తారా అని వైఎస్.జగన్ నిలదీశారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని పీఏసీ సభ్యులకు వైఎస్.జగన్ దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని భూములను తమ అనూయాయులకు దోచిపెడుతోందని విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఊరూ పేరు లేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారని జగన్ విమర్శించారు. లులూ గ్రూపుకు రెండు వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మనం నొక్కినట్లు బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదని అందుకే చంద్రబాబు బటన్ లు నొక్కడం లేదని వైఎస్.జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచక పరిస్ధితులు ఉన్నాయని ఇటువంటి సమయంలోనే పీఏసీ సభ్యులు క్షేత్ర స్ధాయిలో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుని పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు.