- బీఆర్ఎస్ ప్రభుత్వం తినడానికి అప్పులు చేసింది…
- మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మేము అప్పుల చేయాల్సి వస్తోంది
- అప్పుల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
- బీఆర్ఎస్ చేసిన అప్పులు 7,11,911 కోట్లు
- అక్షరాల ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు
అప్పుల విషయంలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీయం భట్టి మాట్లాడుతూ గత పదేళ్ళలో దేనికి ఎంత అప్పు తెచ్చారు…? ఎంత మొత్తం తెచ్చారనే దానిపై ప్రభుత్వం వద్ద అణా పైసలతో సహా లెక్కలు ఉన్నాయని వెల్లడించారు. మా హయాంలో కేవలం 3 లక్షలే అని మూడున్నర లక్షలే అని… కాంగ్రెస్ ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రం తప్పు అని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని భట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వం నేరుగా రిజర్వ్ బ్యాంకు నుంచి తెచ్చుకునే ఎఫ్ఆర్బీఎం లోన్లు 2014లో రాష్ట్ర విభజన సమయాని 72658 కోట్లు ఉంటే 2024వ సంవత్సరానికి 389673 కోట్లు ఉన్నాయని తెలిపారు అలాగే కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చే అప్పులు 2014లో 5893 కోట్లు ఉంటే 2024 కల్లా ఆ రకమైన కార్పొరేషన్ అప్పులను 95462 కోట్లకు తీసుకు వచ్చారని భట్టి విక్రమార్క వివరించారు. ఇవి కాకక ఇతర కార్పొరేషన్లు నుంచి ప్రభుత్వ గ్యారంటీ లేకుండా మరో 59414 కోట్లు తీసుకు వచ్చారని ఈ కార్పొరేషన్లకు 2014 వరకూ ఒక్క రూపాయి కూడా అప్పులేదని తెలిపారు. అలాగే ఇరిగేషన్, ఆర్ఆండ్బీ, పంచాయితీరాజ్, గ్రామ పంచాయితీలు, హస్పటల్స్, మిడ్ డే మీల్స్ బిల్లులతో పాటు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఎఫ్ లు సైతం చెల్లించకుండా 40 వేల కోట్ల రూపాయలు అప్పుగా పెట్టి పోయారని ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు అప్పును రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి పోయారని లెక్కలు తేల్చారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
అప్పులు దాస్తే దాగేవి కాదు…
రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఈ అప్పుల లెక్కలను రేపు శాసనసభలో కూడా చెపుతామన్నారు డిప్యూటీ సీయం. మరీ ఇంత పచ్చి అబద్దాలు ఆడటం కరెక్ట్ కాదు… ఇవన్నీ దాస్తే దాగేవి కాదు… మేము కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నామని ఆరోపిస్తున్నారు… మీరు అప్పులు తినడానికి చేస్తే మేము మీరు చేసిన అప్పులకు వడ్డీ కడట్టడానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మేము అప్పులు చేస్తున్నామన భట్టి వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 54118 కోట్ల రూపాయాలు అప్పు తీసుకువస్తే 66722 కోట్లు అప్పు వడ్డీతో కలిపి ఇప్పటి వరకూ కట్టామని వివరించారు. 2014లో సంవత్సరానికి 6400 కోట్లు అప్పు వడ్డీతో కలపి కట్టాల్సి ఉండగా ఈ పదేళ్ళలో దాన్ని 66722 కోట్లు కట్టాల్సిన దుస్ధితి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని విమర్శించారు. ఇంత భారం ప్రజలపై పడేసి సిగ్గు లేకుండా హరీష్ రావు, కేటీఆర్ లు గాయ్ గాయ్ అని అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు మా ప్రభుత్వం చేసినట్లు ఎవ్వరూ చెయ్యలేదు…
రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి వడ్ల గింజని ప్రభుత్వం కొని వారం రోజుల లోపు రైతులకు డబ్బులు కూడా జమ చేస్తోందని తెలిపారు. అంతే కాకుండా సన్నాలకు 500 బోనస్ కూడా ఇస్తున్నామన్నారు. రైతులకి మేము చేసినంతగా ఎవరూ చెయ్యలేదని అధికారంలోకి వచ్చి సంవత్సరం లోపే 21వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. మీరు లక్ష రూపాయల రుణమాఫీ చెయ్యడానికి రైతులను ముప్పతిప్పలు పెట్టారని గుర్తు చేశారు. అంతేకాకుండా రైతు భరోసా కింద 7625 కోట్లు, రైతు భీమా కోసం 1514 కోట్లు చెల్లించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఇవేవీ కట్టలేదన్నారు. అదే విధంగా మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ 55 కోట్లు, అయిల్ పామ్ సాగుకి 40 కోట్లు, విత్తనాలకు 36 కోట్లు మొత్తం కలిపి 2988 కోట్లు వ్యవసాయానికి, రైతులకు మా ప్రభుత్వం గడచిన ఏడాదిగా ఖర్చు చేసిందని వివరించారు. ఇవేకాకుండా వ్యవసాయ పంపు సెట్లు 28 లక్ష ఉంటే వాటి కరెంటు బిల్లుల కింద 11270 కోట్లు విద్యుత్ శాఖకు కడుతున్నాం… మీలా అప్పు పెట్టి పోలేదు అని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు సంబంధించి మీరు పెండింగ్ లో పెట్టి బిల్లుల్లో 9795 కోట్లు చెల్లించామన్నారు. అన్నీ కలిపి 50953 కోట్లు కేవలం వ్యవసాయానికి రైతులకు వ్యయం చేశామని డిప్యూటీ సీయం తెలిపారు. ఇవేవీ మీరు చెయ్యలేదు కదా… పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేలు చొప్పున ఇచ్చాం. పదేళ్ళులో మీరు అసలు పట్టించుకోలేదు… రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఎనలేని నిబద్దత ఉంది. మీకులా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ప్రజలను మభ్యపెట్టి పోదామన్న ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా…
అన్ని ప్రభుత్వ హస్టళ్ళు, గురుకుల విద్యార్థులకు పెంచిన మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను అమలు చేస్తూ ముఖ్యమంత్రితో పాటు నేను మా మంత్రి వర్గ సహచరులు, ఐఎఎస్, ఐపీఎస్ లు ఇతర ఉన్నతాధికారులు అందరం శనివారం హస్టళ్ళు, గురుకులాలకు వెళ్ళి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి సహపంక్తి భోజనం చేశామని డిప్యూటీ సీయం చెప్పారు. ఇందులో పాల్గొన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వంపై ఆర్థికపరమైన అనేక ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ విద్యార్థును రాష్ట్ర ఆస్తిగా భావించి ఎంత ఆర్థిక భారం పడినా అమలు చెయ్యాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని భట్టి పేర్కొన్నారు.
విలేకరుల సమావేశానికి ముందు మధిర పట్టణంలో 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయనున్న ఆర్ అండ్ బి డ్రైన్స్, ఫుట్ పాత్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. పట్టణంలో జరుగుతున్న ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.